పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో కదిలిన అధికారులు

జిల్లాల్లో తడిసిన ధాన్యంపై వివరాల సేకరణ
కొనుగోలుకు స్పష్టమైన ఆదేశాలు
హైదరాబాద్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): పౌరసరఫరాలశాఖ అధికారు ఆదేశాల మేరకు జిల్లాల్లో అధికారులు తడిసిన ధాన్యం వివరాలను సేకరిస్తున్నారు. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ధాన్యం ఎంత ఉంటుందన్న ఆరా  తీస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశారు. అకాల వర్షాలపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను పరిశీలించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకు పోకుండా వీలైనంత త్వరగా రైస్‌మిల్లులకు తరలించాలని, ధాన్యం లోడింగ్‌, అన్‌లోడింగ్‌ విషయంలో మిల్లర్లు మరింత వేగంగా స్పందించేలా చూడాలని అధికారులకు అకున్‌ సబర్వాల్‌ సూచించారు. జిల్లా స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు దాదాపు 29.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 29.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించినట్టు అకున్‌ సబర్వాల్‌ వెల్లడించారు. మరోవైపు, కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు, నిర్మల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. జగిత్యాల,ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, జగిత్యాల, భూపాలపల్లి, వరంగల్‌ జిల్లాల్లో అకాల వర్షాల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి అక్కడి పరిస్థితులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లతో సవిూక్షించారు. అకాల వర్షాలు కురిసిన జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడ అత్యవసరంగా చేపట్టవలసిన తక్షణ చర్యలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. అవసరమైన టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రైతాంగానికి నష్టం జరగకుండా, సమస్యలు ఎదురు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అకున్‌ సబర్వాల్‌ సూచించారు. కేంద్ర కార్యాలయం అనుమతి లేకుండా అధికారులు ఎవరూ జిల్లా కేంద్రాలను వదిలి వెళ్లకూడదని ఆదేశించారు.