విజయనగరం,నవంబర్1(జనంసాక్షి): ప్రకృతి వ్యవసాయంతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. గురువారం దుగ్గేరు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలను అడిగి తెలుసుకున్నారు. పంటపొలాల్లో తయారు చేస్తున్న జీవామృతం, ఘన జీవామృతం, వివిధ రకాల కషాయాలను ఆయన పరిశీలించారు. మిగిలిన గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయంపై రైతులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారని, వారిని చూసి కొంత మంది రైతులు కూడా ఈ పద్ధతిపై దృష్టి సారిస్తున్నారని అన్నారు. 2023 నాటికి జిల్లా మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.




