Thursday, 5 November 2026

ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ నేతలు

ఊరూరా ప్రచారంలో పాల్టొంటున్న అభ్యర్థులు

హైదరాబాద్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఉదయమే ప్రచారంలో దూకుతున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఉదయమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి షిండే కూడా ప్రచారంలో పాల్గొన్నారు. శాంతాపూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీకి భారీగా జనం హాజరయ్యారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్‌ గౌడ్‌ ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని అప్పనపల్లి, ఎనుగొండ వార్డులలో గౌడ్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలు శ్రీనివాస్‌ గౌడ్‌కు తిలకం దిద్ది మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.టీఆర్‌ఎస్‌ తోనే అభివృద్ధి సాధ్యమని ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్నారు. నిర్మల్‌ పట్టణంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం భంగల్‌ పేట్‌ లో ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేసి అనంతరం ప్రచారాన్ని మొదలుపెట్టారు. బంగల్‌ పేట్‌ లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత శ్రీహరి రావు, నిర్మల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అడిగారు. గత పాలకులు 60 ఏళ్లలో చేయని అభివృద్ధి, నాలుగేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందన్నారు. కేసీఆర్‌ ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తున్నారని, కేసీఆర్‌ కిట్ల వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతోందని వివరించారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. నిర్మల్‌ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని, మరోసారి ఆశీర్వదిస్తే నిర్మల్‌ ముఖ చిత్రాన్ని మారుస్తానని చెప్పారు. మహాకూటమి ముసుగులో మాయగాళ్లు వస్తున్నారని, మాయగాళ్ల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.