Saturday, 7 November 2026

ప్రచార పర్వంలోకి బీజేపీ అగ్రనేతలు

– ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతల విస్తృత పర్యటనలు

– అమిత్‌షా, మోదీలు రాక

– 27న తెలంగాణ రానున్న ప్రధాని మోదీ

– రెండు రోజుల పాటు సభల్లో పాల్గొననున్న మోదీ

హైదరాబాద్‌, నవంబర్‌22(జ‌నంసాక్షి) : తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కమలనాథలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సహా పలువురు కేంద్రమంత్రులు ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ప్రచారపర్వంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 27, డిసెంబర్‌ 3న జరిగే బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. 27న నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జరిగే భారీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారు. వచ్చే నెల 3న హైదరాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. రాష్ట్ర నాయకత్వం మాత్రం హైదరాబాద్‌ బహిరంగ సభతో పాటు ఏదో ఒక జిల్లాలో బహిరంగ సభలో పాల్గొనాలని కోరుతున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 24న రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న అమిత్‌షా 25న మధ్యాహ్నం 12 గంటలకు పరకాలలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 1:45కు నిర్మల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 3:20 కి దుబ్బాక, 4:45కి మేడ్చల్‌లో జరిగే బహిరంగ సభలకు హాజరై తిరిగి ఢిల్లీకి

వెళ్లిపోతారు. 28న మళ్లీ హైదరాబాద్‌ చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు చౌటుప్పలో సభకు హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా 3:45కి హిమాయత్‌ నగర్‌ లిబర్టీ, ముషీరాబాద్‌, అంబర్‌ పేట విూదుగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వరకూ సాగే రోడ్డుషోలో పాల్గొంటారు. సాయంత్రం 5:45కి ఎల్బీనగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు.

తిరిగి మళ్లీ డిసెంబరు 2న అమిత్‌ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. 12గంటలకు నారాయణపేటలో జరిగే సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 1:35కి ఆమనగల్‌లో కల్వకుర్తి సభ, 3 గంటలకు ఉప్పల్‌, మల్కాజిగిరి రోడ్‌షోలలో పాల్గొంటారు. సాయంత్రం 5:15కు కామారెడ్డిలో జరిగే బహిరంగ సభతో అమిత్‌ షా రాష్ట్ర పర్యటన పూర్తి అవుతుంది. మొత్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు దిశానిర్దేశం, ప్రచారం జరిగేలా రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసింది. మోదీ, అమిత్‌ షాతో సహా పలువురు కేంద్రమంత్రులు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరై కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.