Saturday, 7 November 2026

ప్రజల ఆదరణతో మరింత అభివృద్ది

టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్ప

కొమురంభీం ఆసిఫాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): జిల్లాలోని సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ నియోజకవర్గం చింతలామానేపల్లి మండలంలోని గుడెం గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సదర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సేవ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ప్రజల ఆదరణతో నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, రూపురేఖలు మారుస్తానని కోనేరు కోనప్ప అన్నారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ఎస్పీఎం విషయంలో అవాకులు.. చవాకులు మాట్లాడే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎంత మంది ఒక్కటైనా తమ నాయకుడు, ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నియోజకవర్గానికి సాధ్యమైనంత ఎక్కువగా డబుల్‌బెడ్‌రూంలు మంజూరయ్యేలా కృషిచేస్తానని హావిూ ఇచ్చారు. ఎస్పీఎం, సర్‌సిల్క్‌ కంపెనీలు నియోజకవర్గానికి రెండు కళ్లలాంటివన్నారు. ఎసీఎంను తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిందనీ, సర్‌సిల్క్‌ మిల్లు స్థానంలో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానన్నారు.