Thursday, 5 November 2026

ప్రజాకూటమిగా అధికారంలోకి వస్తాం

– నేడు మహాకూటమి ఉమ్మడి ప్రణాళికను ప్రకటిస్తాం
– టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క
– భట్టి నివాసంలో కూటమి నేతల భేటీ
– కనీస ఉమ్మడి ప్రణాళికపై చర్చ
హైదరాబాద్‌, నవంబర్‌12(జ‌నంసాక్షి) : డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో ప్రజా కూటమిదే విజయమని, అధికారంలోకి వచ్చి తీరుతామని  కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం భట్టి నివాసంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ, తెజస అధ్యక్షుడు కోదండరాం, తెదేపా సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కనీస ఉమ్మడి ప్రణాళికపై వీరు చర్చించారు. ఎన్నికల మేనిఫెస్టోపై కూడా సవిూక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చేయాల్సిన పనులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ప్రజాకూటమిగా తాము అధికారంలోకి వస్తామని ధీమావ్యక్తం చేశారు. కలిసొచ్చే అన్ని పార్టీలు తమకు ముసాయిదా అందించాయని తెలిపారు. రేపు మరోసారి సమావేశమై భాగస్వామ్య పార్టీలతో చర్చిస్తామని చెప్పారు. సామాన్యుల అజెండాను కాంగ్రెస్‌ పార్టీకి అందించామని అన్నారు.
కోదండరాం మాట్లాడుతూ.. భాగస్వామ్య పార్టీలన్ని ముసాయిదాను అంగీకరించాయని తెలిపారు. నిరంకుశ పాలనకు, సామాన్య ప్రజల ఎజెండాకు మధ్యనే ఎన్నికలు జరగనున్నట్టు పేర్కొన్నారు. కేసీఆర్‌ కుటుంబం ఒక వైపు, తెలంగాణ ప్రజలంతా ఒక వైపు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం దీన్ని అధికారికంగా విడుదల చేస్తామని చెప్పారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాన్యుల, ఉద్యమకారుల ఎజెండానే తమ ఎజెండా అని స్పష్టం చేశారు.