Tuesday, 3 November 2026

ప్రతిపక్షాలు కీలకపాత్ర పోషిస్తాయి

7

సర్కారుతో సహకరిస్తాయి

ప్రధాని మోడీ ఆశాభావం

న్యూఢిల్లీ, నవంబర్‌ 24 (జనంసాక్షి) : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు కీలకపాత్ర పోషిస్తాయని ప్రధాని నరేంద్రమోడీ ఆశాభావం వ్యక్తంచేశారు. సర్కారుతో పూర్తిగా సహకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సమావేశాలు ఫలప్రదమవుతాయని మోడీ ఆకాంక్షించారు. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపక్షాలు కీలక పాత్ర పోషించడంతోపాటు ప్రభుత్వానికి సహకరించాయని కొనియాడారు. అదే తరహాలో ప్రస్తుత సమావేశాల్లోనూ కీలక బిల్లుల ఆమోదానికి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి ప్రారంభమైన శీతాకాల సమావేశాలకు మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో ఆయన విూడియాతో మాట్లాడారు. బడ్జెట్‌ సమావేశాల మాదిరే ఈ సమావేశాలు కూడా విజయవంతమవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు గతంలో లాగే ప్రభుత్వానికి సహకరిస్తాయని భావిస్తున్నామని చెప్పారు. తాము చేపడుతున్న ఆర్థిక సంస్కరణలకు మద్దతునిస్తాయని ఆకాంక్షించారు. ఫలవంతమైన చర్చలకు విపక్షాలు సహకరిస్తాయని తెలిపారు. ‘ప్రభుత్వాన్ని నడిపించాలని దేశ ప్రజలు మాకు బాధ్యత అప్పగించారు.. అలాగే పార్లమెంట్‌ను సక్రమంగా నడిపించేందుకు సిట్టింగ్‌ ఎంపీలందరికీ బాధ్యతలు అప్పగించారని’ మోడీ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాయని, ప్రస్తుత సమావేశాల్లో అలాగే వ్యవహరిస్తాయని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మంచి వాతావరణంలో ప్రజలకు మేలుచేసే చర్యలు చేపడతామన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్‌ బిల్లు వంటి కీలక బిల్లులను పలు విపక్షాలు వ్యతిరేకిస్తున్న తరుణంలో మోడీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వంపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్‌ బిల్లుతో పాటు నల్లధనం వంటి అంశాలు పార్లమెంట్‌ను కుదిపేయనున్నాయి. వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు పలు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాల ఐక్యత కోసం మద్దతివ్వాలని కాంగ్రెస్‌ను కోరుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *