Monday, 2 November 2026

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మురళీదేవర మృతి

6

న్యూఢిల్లీ, నవంబర్‌ 24 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా (77) మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధ పడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు. రెండ్రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం ముంబైలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మురళీ దేవ్‌రాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మాజీ ఎంపీ మిలింద్‌ దేవరా ఆయన కుమారుడే. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో  మురళీ దేవ్‌రా పలు కీలక పదవులు అధీష్టించారు. 1975 ముంబై ఎన్నికల్లో పోటీచేయడంతో ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన దేవ్‌రా.. 1977-78 మధ్యకాలంలో ముంబై మేయర్‌గా పని చేశారు. అనంతరం దక్షిణ ముంబై నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. తన కుమారుడు మిలింద్‌ కోసం ఆయన తన స్థానాన్ని త్యాగం చేశారు. 2002లో మురళీ దేవ్‌రా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. యూపీఏ హయాంలో ఆయన కీలకమైన శాఖలు చేపట్టారు. 2006లో పెట్రోలియం, సహజవనరుల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఐదేళ్ల పాటు పూర్తికాలం పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత ఆయన సొంతం. చమురు రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. 2011లో కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముంబై కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా 22 సంవత్సరాలు పని చేశారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడగా దేవ్‌రా పేరొందారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి సన్నిహితుడిగా వ్యవహరించే వారు.

సంతాపం తెలిపిన పార్లమెంట్‌

కేంద్ర మాజీ మంత్రి మురళీదేవరాకు పార్లమెంట్‌ ఉభయ సభలు సంతాపం తెలిపాయి. ఉదయం సమావేశమైన ఉభయసభలు ఆయనకు నివాళులు అర్పించాయి. కేంద్ర మంత్రిగా, దక్షిణ ముంబై ఎంపీగా, మేయర్‌గా ఆయన చేసిన సేవలను లోక్‌సభ, రాజ్యసభలు స్మరించుకున్నాయి. రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మురళీ దేవ్‌రా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆదివారం సాయంత్రమే మురళీ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడానని, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశానని తెలిపారు. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ‘దేవ్‌రా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని’ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశం ఓ సీనియర్‌ పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *