ప్రతీగింజా కొనాల్సిందే..
` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
చేవెళ్ల,డిసెంబరు 18(జనంసాక్షి): రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. చమురు, నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల నుంచి రేవంత్ పాదయాత్ర చేపట్టారు. ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర సాగింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. రూ.లక్షకోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకట్టినా ఏం ప్రయోజనమని రేవంత్ ప్రశ్నించారు. అగ్గిపుట్టిస్తానని వెళ్లిన కేసీఆర్ దిల్లీలో ఏం చేశారని నిలదీశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కేసీఆర్‌కు లేదని విమర్శించారు. 2014లో పెట్రోల్, డీజిల్ ధర లీటరు రూ.60లు ఉండగా ఇప్పుడు 108రూపాయలు అయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో చేతినిండా డబ్బులు తీసుకుపోతే సంచి నిండా సరుకులు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. ఈ ఎనిమిదేళ్లలో పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ.32లక్షల కోట్లు దోచుకుందని రేవంత్ ఆరోపించారు.