Tuesday, 3 November 2026

ప్రభాస్‌ కేసులో తీర్పు రిజర్వ్‌

హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ భూ వివాదంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. హైదరాబాద్‌ శివారు రాయదుర్గంలో ప్రభాస్‌ గెస్టెహౌస్‌ ఉన్న 2081గజాల స్థలం ప్రభుత్వానిదని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు ఇటీవల గెస్ట్‌హౌస్‌ను సీజ్‌ చేశారు. అధికారులు సీజ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగ్గా.. ప్రభాస్‌ తరఫు న్యాయవాది వాదనలు విన్పించారు. ఆ స్థలం ప్రభాస్‌ తండ్రి గతంలో కొనుగోలు చేశారని, క్రమబద్ధీకరణ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్ననట్టు చెప్పారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ప్రభాస్‌ గెస్ట్‌ హౌస్‌ను సీజ్‌ చేశారని కోర్టుకు తెలిపారు. ప్రభాస్‌ దరఖాస్తుపై  ఎందుకు స్పందించలేదని నిన్న హైకోర్టు ప్రశ్నించడంతో గురువారం ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్‌ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకూ ఆ స్థలంలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.