హెచ్‌సిఎ అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదన్న ధర్మాసనం
సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తూ పునర్విచారణకు ఆదేశాలు
హైకోర్టు తీర్పును స్వాగతించిన అజారుద్దీన్
హైదరాబాద్,జూన్12(జనం సాక్షి ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు వివేక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేక్ ఎన్నిక చెల్లదంటూ అంబుడ్స్ మెన్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా పునర్విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు తాజా ఉత్తర్వులతో వివేక్ మరోసారి పదవి కోల్పోనున్నారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా అజారుద్దీన్‌పై వివేక్ గెలుపొందారు. అయితే వివేక్ ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ హెచ్ సీఏ పదవిలో కొనసాగడం లోధా కమిటీ సిఫార్సులకు, చట్టానికి విరుద్దమంటూ అజారుద్దీన్ అంబుడ్స్ మెన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అంబుడ్స్ మెన్ వివేక్ ఎన్నిక చెల్లదని తేల్చిచెప్పింది. అంబుడ్స్ మెన్ నిర్ణయంతో పదవి కోల్పోయిన వివేక్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి అంబుడ్స్ మెన్ తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వివేక్‌కు ఊరట కలిగింది. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ అజారుద్దీన్ ధర్మాసనం ఎదుట అప్పీలు దాఖలు చేశారు. అజారుద్దీన్ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జిని ఆదేశించారు. ధర్మాసనం తాజా ఉత్తర్వులతో అంబుడ్స్ మెన్ నిర్ణయం అమలులోకి వచ్చినందున వివేక్ మరోసారి పదవి కోల్పోనున్నారు. గతంలో అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పును సమర్ధించిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అప్పటి వరకు వివేక్ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో కొనసాగొద్దని తీర్పునిచ్చింది.పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్ అనర్హుడని ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి మార్చిలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేబినేట్ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ జి.వివేక్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ అప్పట్లో స్టే విధించింది. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తెలిపారు. వివేక్ ప్యానల్ ఎంపిక నిబంధనల ప్రకారం జరగలేదన్నారు. అంబడ్స్‌మెన్ వివేక్‌పై తీసుకున్న నిర్ణయమే నిజమైందన్నారు. తొలి నుంచి తాము వివేక్ ప్యానల్‌పై పోరాటం చేస్తున్నామని, చివరకు హెచ్‌సీఏలో న్యాయమే గెలిచిందని తెలిపారు. హెచ్‌సీఏలో ఏం జరగాలన్నది జనరల్ బాడీ విూటింగ్ నిర్వహిస్తారన్నారు.




