Tuesday, 3 November 2026

ప్రయుత చండీయాగం చేస్తా

ప్రభుత్వ లక్ష్యాలు విజవంతమైతే (కిక్కర్‌)
C
– ముగిసిన అయుత చండీయాగం

– లోకకళ్యాణం కోసమే చేశా

– సీఎం కేసీఆర్‌

ఎర్రవల్లి,డిసెంబరు 27(జనంసాక్షి) :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అయుత చండీమహాయాగం ఆదివారం సాయంత్రం ముగిసింది. మఠాధిపతులు, మాన్యులు, సామాన్యుల సమక్షాన… కేసీఆర్‌ వైయక్తికంగా తలపెట్టిన చండీయాగం ఐదురోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. రెండువేల మంది రుత్వికులు ఈ యాగంలో పాల్గొన్నారు. యాగంలో చివరి క్రతువైన పూర్ణాహుతితో ఆదివారం సాయంత్రం యాగం పరిసమాప్తమైంది. యాగం జరిగిన ఐదురోజులు ఎర్రవల్లి పరిసరాలు వేదఘోషతో ప్రతిధ్వనించాయి. యాగం చూసేందుకు తరలివచ్చిన ప్రతి ఒక్కరూ సరికొత్త ఆధ్మాత్మిక అనుభూతికి లోనయ్యారు. ప్రస్తుత కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో కేసీఆర్‌ తలపెట్టిన అయుత చండీయాగాన్ని తిలకించేందుకు దేశంలోని పలు మఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నాయకులు… ఇలా ఎందరో ప్రముఖులు తరలివచ్చారు.

పూర్ణాహుతితో మహాయాగం పరిపూర్ణం

అయుత చండీయాగంలో చివరి ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమం వేద మంత్రోచ్చరణల మధ్య పరిపూర్ణమైంది. స్వావిూజీలు, రుత్వికుల వేద మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా పూర్ణాహుతి నిర్వహించారు. విశ్వశాంతి, విశ్వకల్యాణం, ప్రజల సౌభాగ్యమే సంకల్పంగా నిర్వహించిన పూర్ణాహుతికి జగద్గురు శృంగేరి పీఠాధిపతి ¬మద్రవ్యాలు, వస్త్రాలు పంపించారు. దుర్గాచక్రం, మహంకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మీ సన్నిధి మధ్యకుండంలో పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణఫలాలు, పుష్పాలు, నవధాన్యాలు, సమిధలు, పట్టువస్త్రాలు, కొబ్బరికాయలు, సుగంధ ద్రవ్యాలతో ఆదిశంకరాచార్య సూచించిన నియమావళి ప్రకారం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, పలువురు స్వావిూజీలు, ప్రముఖులు పాల్గొన్నారు. ముగింపు క్రతువులో భాగంగా గవర్నర్‌ దంపతులను కేసీఆర్‌ సత్కరించారు. చివరిగా కేసీఆర్‌ దంపతులు, గవర్నర్‌ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.

హాజరైన ప్రముఖులు

ఐదు రోజుల పాటు జరిగిన అయుత చండీయాగానికి వివిధ రాష్ట్రాల నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ వ్యవస్థాపకుడు రవిశంకర్‌ గురూజీ, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.భోసలే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఈనాడు ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, సినీనటులు కృష్ణంరాజు, నాగార్జున, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యాగానికి హాజరయ్యారు.

ఎర్రవల్లికి పోటెత్తిన భక్తజనం

కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అయుత చండీయాగంపై సాధారణ ప్రజల్లోనూ అమితమైన ఆసక్తి కలిగింది. అయుత చండీయాగం అంటే ఏమిటి? అది ఎలా చేస్తారో? తెలుసుకునేందుకు… యాగాన్ని కనులారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఎర్రవల్లికి పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. యాగాన్ని తిలకించేందుకు వచ్చిన వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నిర్వాహకులు సకల ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బస్సులతో రవాణా ఏర్పాట్లు చేయడమే కాక అతిథులందరికీ భోజన వసతి కల్పించారు. యాగం జరిగిన ఐదురోజులు ఎర్రవల్లి జనసంద్రాన్ని తలపించింది.

ఆసక్తి రేపిన వస్త్రధారణ

చండీయాగం నిర్వహణతో పాటు యాగకర్త, రుత్వికులు ధరించిన వస్త్రధారణ కూడా ప్రజల్లో ఆసక్తి రేపింది. యాగంలో పాల్గొన్న వారంతా తొలిరోజు పసుపు, రెండోరోజు గులాబీ, మూడోరోజు తెలుపు, నాలుగోరోజు ఎరుపు, ఐదోరోజు పసుపు వస్త్రాలు ధరించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చండీమాతకు కోరుకున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులు విజయవంతమైతే ప్రయుత చండీయాగం నిర్వహిస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. అయుత చండీయాగంలో పాల్గొన్న రుత్విజులే ప్రయుత చండీయాగంలోనూ పాల్గొనాలని కేసీఆర్‌ కోరారు.

ప్రయుత చండీ మహా యాగాన్ని నిర్వహిస్తా: సీఎం కేసీఆర్‌

అనుకున్న లక్ష్యాలు నెరవేరితే, ప్రాజెక్టులన్నీ పూర్తయి తెలంగాణ రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే ప్రయుత చండీ మహా యాగాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నానని వెల్లడించారు.అయుత చండీయాగం ఏ ఒక్కరి కోసమే చేసినది కాదని… ఇది విశ్వకల్యాణం, లోకహితం కోసం చేసిన యాగమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అనంతరం యాగంలో పాల్గొన్న రుత్విజులకు కేసీఆర్‌ సత్కారం చేశారు. యాగాలు నిర్వహించడం తనకు కొత్తేవిూ కాదని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తాను ఈ యాగం నిర్వహిస్తోన్న సమయంలో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలు విజయవంతం కావాలని చండీ అమ్మవారిని కోరుకున్నానని వెల్లడించారు. ప్రయుత చండీ యాగానికి కూడా ప్రయోక్తలు విూరే కావాలన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాలు, కులాల ప్రజలు సుసంపన్నంగా బతికితే తనకు అంతకన్నా సంతోషమేముంటుందని తెలిపారు. తెలంగాణలో అందరూ చిరునవ్వులతో బతకాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఇవాళ ఆయన అయుత మహా చండీ యాగం ముగిసిన తర్వాత రుత్వికులను, భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం వివరాలు.. నేను ఈ యాగం తలపెట్టినపుడు ఎందరో అవాకులు చెవాకులు పేలారు. ఈ యాగం ఏ ఒక్కరి కోసమో చేసింది కాదు. సర్వ మానవాళి క్షేమం కోసం చేశాం. అమ్మవారి సేవలో పాల్గొనే అవకాశం కలిగించినందుకు ధన్యావాదాలు. త్వరలో మా కుటుంబ సభ్యులమంతా శృంగేరి వెళ్లి స్వామివారిని కలుస్తాం. నేను ఇంటింటికి మంచినీటిని అందించే మిషన్‌ భగీరథ దిగ్విజయంగా పూర్తి చేసి ఇంటింటికి మంచినీటిని అందిస్తాం. చండీ మాతాకీ జై అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *