◆◆◆◆ అందుబాటులో లేని వైనం
◆●●●. చరవాని ఎత్తరు, బదులి వ్వరు
◆◆◆◆ సర్వత్రా విమర్శలు
మానకొండూరు, ఆర్.సి జనవరి 3 (జనం సాక్షి)
మానకొండూరు నియోజకవర్గంలోని మండలాలలో భాజపా నాయకుని వ్యవహార శైలి ప్రశ్నార్థకమవుతోంది. ఎమ్మెల్యే స్థానానికి ఆశావహునిగా మానకొండూరు నియోజకవర్గం లో అరాగేట్రం చేసిన ఓరం జయ చందర్ వ్యవహారం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకులకు సైతం అందుబాటులో లేకపోవడం, గత కొద్ది కాలంగా ఫోన్లకు సైతం స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మానకొండూరు నియోజకవర్గం లోని తిమ్మాపూర్, శంకరపట్నం ,మానకొండూరు, ఇల్లంతకుంట, గన్నేరువరం ,బెజ్జంకి మండలాల్లో ఏ ఒక్కరికి అందుబాటులోకి లేకపోవడం, రాకపోవడం పై భాజపా వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. క్యాడర్ కు కనెక్ట్ కాలేకపోయాడా, లేక పార్టీ వర్గాల మెప్పు పొందలేకపోయాడా, పార్టీ క్షేత్రస్థాయి నాయకుల, కార్యకర్తల మనోభావాల్లో క్యాడర్ ఈ నాయకుడిని సరియైన ఆశావాహునుగా ఆమోదించలేకపోయారా అన్న ప్రశ్నలు శేష ప్రశ్నలు గానే మిగిలిపోయాయి. అసలు పార్టీలో ఎప్పుడు చేరారు, సభ్యత్వం ఎప్పు డు ,ఎక్కడ తీసుకున్నారో సైతం నేటి వరకు ఏ నాయకునికి తెలియక పోవడం ఇక్కడ గమనార్హం. కండువా కప్పుకున్నది ఎక్కడో ఇత్యాది ప్రశ్నలకు జవాబు దొరకని దుస్థితి. వీణవంక మండలానికి చెందిన వ్యక్తిగా పరిచయమయ్యాడని పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గం లోని రెండు మండలాల పార్టీ అధ్యక్షులతో నేరుగా ఆర్థిక లావాదేవీలు నెరిపి నా నేటి వరకు వారికి సైతం ఫోను కాల్స్ కు, మెసేజ్ లకు సైతం స్పందించడం లేదని ఆ నాయకులు లబోదిబోమంటున్నారు. పార్టీ మండల అధ్యక్షులతో అంత సఖ్యత లేకపోవడమా, రాజకీయ సన్యాసమా అంత చిక్కడం లేదు. మానకొండూరు మండలంలోని శ్రీనివాస్ నగర్ గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో రూపాయలు పదివేలు, చెంజర్ల గ్రామంలో క్రీడాకారులకు దుస్తుల పంపిణీ, ఇల్లంతకుంట మండలంలో కందికట్కూర్, పెద్ద లింగాపూర్ గ్రామాలలో పుస్తె ,మట్టెలు వితరణ, చేసి దాతృత్వం ప్రదర్శించినా, ఆయా మండలాల మండల అధ్యక్షులతో సఖ్యత కరువైందనే విమర్శలున్నాయి. కార్యకర్తలతో, పార్టీలోని ఒకరిద్దరితో టచ్ లో ఉండి అందరికీ అందుబాటులో లేకపోవడం, పార్టీ మండల అధ్యక్షులతో అంత కలివిడిగా లేకపోవడమే ఆ నాయకుని తెర మరుగుకు కారణమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాయకుడు ఓరం నేరుగా శాసనసభ్యులుగా పోటీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించుకోవడం, పార్టీ కార్యక్రమాల్లో ఇతర నాయకులతో కలిసి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పర్యటించినా అంత ఫలప్రదం కాలేదనే అపవాదులు లేకపోలేదు. ఏది ఏమైనా నాయకులకు, కార్యకర్తలకు, అధిష్టానానికి, అందుబాటులో ఉంటూ క్యాడర్ కు కనెక్ట్ కావలసిన కీలక తరుణంలో నాయకుని వ్యవహార శైలి విస్తు గొలుపుతోంది, . తన సొంత వాణిజ్య కార్యకలాపాల్లో తీరిక లేకుండా గడిపినా కొందరితోనైనా ఫోనులో, మెసేజ్ లకు అందుబాటులో లేకపోవడం, రాకపోవడం ప్రశ్నార్థకమవుతోంది. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగా నాయకుని అంతర్మథనo ఎలా ఉందో ప్రజల నాడికి, పైవాడికే ఎరుక.




