ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్,జనవరి24(జనంసాక్షి): ప్రియాంకాగాంధీ రాకతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నెలకొందని, దేశంలో ఆమెకు మంచి క్రేజ్‌తో పాటు ఫాలోయింగ్ ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రయాంక రాక కోసం దేశం ఎదురుచూస్తుందన్నారు. ప్రియాంకకు ఇందిరా పోలికలు ఉండటంతో మంచి క్రేజ్ ఉందని తెలిపారు. రాహుల్‌లో రాజీవ్‌ను.. ప్రియాంకలో ఇందిరను ప్రజలు చూసుకుంటున్నారని తెలిపారు. ప్రియాంక రాక పార్టీకి అదనపు బలం ఇస్తుందన్నారు. రాహుల్ సమర్థతకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ఎన్నికలే నిదర్శనమని చెప్పారు. రాహుల్ మంచి వ్యూహకర్త అని కొనియాడారు. తెలంగాణలో కూడా ప్రియాంక ప్రభావం ఉంటుందన్నారు. ప్రియాంక అయినా.. రాహుల్ అయినా మెదక్ నుంచి పోటీ చేస్తే గెలిపిస్తామన్నారు. సీఎల్పీ నేత భట్టికి పూర్తి మద్దతు తెల్పుతున్నామని స్పష్టం చేశారు. భట్టిని వ్యతిరేకిస్తే.. రాహుల్‌ను వ్యతిరేకించినట్లేనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.




