Tuesday, 3 November 2026

ముగిసిన తెలంగాణ పంచాయితీ సమరం

త్వరలోనే సర్పంచులకు బాధ్యతలు

శిక్షణకు సిద్దం అవుతున్న పంచాయితీ అధికారులు

హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): తెలంగాణలో పంచాయితీ సమరం బుధవారంతో ముగిసింది. ఇక కొత్త పంచాయితీల్లో సర్పంచ్‌లు,ఉపసర్పంచ్‌లు కొలువుదీరనున్నారు. వీరితో పాటు కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్లు కూడా పంచాయితీల్లో ప్రమాణం చేయనున్నారు. దీంతో గ్రామపాలన మొదలు కానున్నది. మరో వారం రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కొలువుతీరనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు మరో మూడు, నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. వారిని గ్రామ కార్యదర్శులు, వారు లేని చోట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన స్పెషల్‌ ఆఫీసర్ల అధ్యక్షతన గ్రామపాలన ఏర్పాటు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో నిర్వహిస్తున్న ఎన్నికల పక్రియలో చివరి దశ బుధవారంనాటితో ముగిసింది. కొత్తగా కొలువుతీరనున్న గ్రామాలకు 14వ ఆర్థిక సంఘం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండవ విడతగా రూ.670 కోట్ల మేరకు రానున్నాయి. మొత్తం రూ.1209 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటికే మొదటి విడతగా గ్రామపంచాయతీలకు రూ.539 కోట్ల నిధులు వచ్చాయి. అయితే పంచాయతీల్లో సర్పంచ్‌ల పాలన గత జూన్‌ మాసంలోనే ముగియడంతో కేంద్రం నుంచి రెండవ విడతగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు కాలేదు. నిబంధనల ప్రకారం సర్పంచ్‌ల పాలన ఉంటేనే నిధులు మంజూరు అవుతాయి. దీని కారణంగానే రెండవ విడత కింద రావాల్సిన నిధులు రాలేదు. అయితే రాష్ట్రంలో పంచాయతీల ఎన్నికల

పక్రియ బుధవారంనాటితో ముగిసి, స్థానిక పాలన ప్రారంభం కానుండడంతో రెండవ విడత కింద రావాల్సిన నిధులను వెంటనే మంజూరూ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పంచాయతీ శాఖ అధికారులు కేంద్రానికి ఒకటి, రెండు రోజుల్లో లేఖను కూడా పంపనున్నారు.

ఈ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లకు పాలనపై అవగాహన పెంచుకునేందుకు ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో సర్పంచ్‌ల విధి విధానాలు, గ్రామసభల నిర్వహణ, పంచాయతీల ఆదాయ, వ్యయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల కింద వచ్చే నిధులు, ఆ నిధులతో ప్రజలకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధానంగా వ్యవసాయం రంగం అభివృద్ధి కోసం యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన నిర్ణయాలు, రైతులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేయాల్సిన వివిధ కమిటీల నియామకాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పంచాయత్‌రాజ్‌ చట్టంపై వారికి అవగాహన కల్పించడం కోసం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గ్రావిూణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా ఐదు రోజుల పాటు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చేందుకుగానూ మాస్టర్‌ ట్రెయినీలకు ఇచ్చే శిక్షణను కూడా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పూర్తి చేశారు. సర్పంచ్‌ల మొదటి రోజు శిక్షణా కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పాలనలో వారికి ఆయన దిశానిర్దేశర చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలు, వాటి ఉద్దేశాలు, సాధించాల్సిన లక్ష్యాలను వివరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలను విధిగా పాటించడంతో పాటుగా గ్రామాల్లో పాలన దూసుకుపోయే విధంగా రూపొందించాల్సిన ప్రణాళికలను కూడా వివరించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలను ఎప్పటి నుంచి నిర్వహించాలన్న అంశంపై కెసిఆర్‌ ఒకటి, రెండు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.