– తెలుగు జాతికే అవమానం
– చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ట్విట్టర్‌లో మండిపడ్డ జీవీఎల్
– చరిత్ర హీనుడిగా పక్కకు తొలిగిపోక తప్పదు – విజయసాయి రెడ్డి
అమరావతి, నవంబర్1(జనంసాక్షి) : బీజేపేతర పార్టీల కూటమి ఏర్పాటే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమయ్యారు. గురువారం హస్తిన పర్యటనలో జాతీయ స్థాయి నేతలతో వరుసగా సమావేశం అయ్యారు. బాబు పర్యటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంకాగా.. ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఆయన్ను టార్గెట్ చేశాయి. ఈసడించుకొన్న కాంగ్రెస్‌తో ఎలా కలుస్తారంటూ విమర్శనాస్త్రాలు సంధించాయి. బీజేపీ ఎంపీ జీవీఎల్, వైసీపీ ఎంపీ విజయసాయి బాబుపై ‘ట్వీట్లు’ పేల్చారు. జీవీఎల్ తన ట్వీట్‌లో.. ‘చంద్రబాబు నాయుడు గారు 1978 లో ఎమ్మెల్యే,1980 లో మంత్రి అయ్యారు. అప్పుడు ఐదేళ్ల వయసున్న అఖిలేష్ యాదవ్ డైపర్లు వేసుకునే వయసు వాడన్నారు. అందరి కంటే సీనియర్ను అని చెప్పుకునే చంద్రబాబుకి ‘బచ్చా’ అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీకి వెళ్ళటం సిగ్గనిపించటం లేదా అని ప్రశ్నించారు. ఇదితెలుగు వారి ఆత్మగౌరవాన్ని కించపరచడం కాదా?’అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా పక్కకు తొలిగిపోక తప్పదంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో విమర్శించారు. ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగ’ మందీ మార్బలంతో కొత్త నిశ్చితార్ధం కోసం బారాత్‌గా ఢిల్లీకి బయల్దేరాడు నిత్యపెళ్ళి కొడుకు అంటూ చంద్రబాబుపై వ్యంగంగా విరుచుకుపడ్డారు. ఈ డ్రామా టైటిల్ ‘దేశ్ బచావ్’.. రియల్ స్టోరీ ‘టీడీపీ బచావ్’ అని అన్నారు. నిన్నటి దాకా ఇటలీ కాంగ్రెస్ అంటూ ఈసడించి ఇప్పుడు పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడు ఈ నిప్పు నాయుడు! అంటూ విజయసాయి మండిపడ్డారు. పేరుకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా, జనహృదయ పాలకుడు మాత్రం జగన్నే అని అన్నారు. ఆయన రాష్ట్ర ప్రజల ఆశాకిరణం అని, సిఎం పీఠాన్ని జగన్కు అప్పగించేందుకు నిండు మనసుతో ప్రజలంతా ఎదురు చూస్తున్నారని విజయసాయి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు ఒక చరిత్ర హీనుడిగా పక్కకు తొలిగి పోక తప్పదుఅని మరో ట్వీట్‌లో విమర్శించారు.




