బయోడేటా కాదు.. 

బ్యాలెన్స్‌ షీటు ముఖ్యం..!
20కోట్లు ఖర్చు చేసేవారినే అభ్యర్థులుగా నిలబెడుతున్నారు
ఓటుకు నోట్లిచ్చినోళ్లు నియితీగా పనిచేస్తారని ఆశించటం ప్రజల పొరపాటే
మార్పు అనేది ప్రజల నుంచిఏ ప్రారంభం కావాలి
మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ
విశాఖపట్నం,జూన్‌7(జ‌నం సాక్షి): నోట్లకు ఓటు వేయడం అంటే అవినీతికి లైసెన్స్‌ ఇవ్వడమేనంటూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ గురువారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని చూస్తే గుండే ఆగిపోయే పరిస్థితి నెలకొందని, ఈ ప్రభావం వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై కూడా పడే అవకాశం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ రాజకీయ పార్టీ తమ సిద్ధాంతాలు, ప్రజల పట్ల అంకితభావం గల వారిని కాకుండా కేవలం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే వారినే అభ్యర్థులుగా నిలబెడుతున్నాయంటూ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే బయోడేటా కాకుండా బాలన్స్‌ షీట్‌ చూపించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇలా ఓటుకు కోసం నోట్లు పంపిణీ చేసే నేతలు నిజాయితీగా పనిచేస్తారని ఆశించడం ప్రజల పొరపాటే అవుతుందని.. అందుకే ‘మార్పు అనేది ప్రజల నుంచే ప్రారంభం కావాలని, అధికార పార్టీలు మారితే ప్రయోజనం ఉండబోదు  అన్న లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ మాటలను రామకృష్ణ ఉటంకించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు లభించడం లేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్న రామకృష్ణ.. ‘వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసమే 2 వేల కోట్ల రూపాయలను ఇక్కడున్న రాజకీయ నాయకులు రహస్య స్థావరాలకు తరలించారని’ ఒక కేంద్రమంత్రి స్వయంగా చెప్పారంటే రాజకీయ వ్యభిచారం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. డబ్బు సంపాదించడం కోసం అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు ఎంతటి ద్రోహులో.. నోట్లు తీసుకుని ఓటు వేసే ప్రజలు సైతం అంతటి ద్రోహులేనంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.