Monday, 2 November 2026

బలిసినోళ్ల భూ కబ్జాలపై ఉక్కుపాదం

3

నిరుపేదలను మినహాయించండి

భూ ఆక్రమణదారులపై పీడీ యాక్టు

కఠినంగా వ్యవహరించండి

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

హైదారాబాద్‌, డిసెంబర్‌ 4 (జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరంలో బడా బాబుల భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుపేదలను మినహాయించి భూ ఆక్రమణదారులపై పీడీ యాక్టు చట్టం ప్రకారం చర్యలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అధికారులకు స్పష్ఠమైన ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారు పేద వారయితే వారికి వెంటనే భూమి పట్టాలు ఇవ్వాలని, దురాక్రమణ దారులయితే వారినుండి భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై పిడి యాక్టు పెట్టడానికి కూడా వెనకాడవద్దని ఆదేశించారు. భూ కబ్జాలకు పాల్పడే  వారు ఎంతటి వారైన, ఏ పార్టికి చెందిన వారయినా, టిఆర్‌ఎస్‌ పార్టి నాయకులైనా  వొదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. హైదరాబాద్‌లో  ప్రభుత్వ భూములను రక్షించడం, భూ కబ్జాలపై  తీసుకోవలసిన చర్యలు, మురికివాడల్లో నివసించే పేదలకు గౌరవ ప్రదమైన నివాసాలు కట్టించడం, నిరుపేదలు ఉంటున్న స్థలాలకు పట్టాలివ్వడం లాంటి అంశాలపై సచావాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు.ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే నిర్మాణం చేపట్టి వాటిని రెగ్యులరైజ్‌ చేసుకుని వున్నట్లయితే వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రజోపయోగ కార్యక్రమాల పేరుతో ప్రభుత్వ భూములు తీసుకోని వాటిని వ్యాపార అవసరాలకోసం ఉపయోగిస్తున్న వారిపై కూడా కఠినంగా వ్యవహిరించాలన్నారు. ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు గుడిసెలు వేసుకునివుంటే వారికి ఆభూమిపై హక్కులు కల్పించాలన్నారు. నాళాలకు అడ్డుగా పేదల గుడిసెలు వుంటే వారికి  ఆవాసం కల్పించాలని కేసిఆర్‌ అధికారులకు సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో నన్ను బదనాం చేయాలని ఎవరైన చూసినా భయపడనని తాను ఖచ్చితంగా ఉంటానని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ చిత్తశుద్దిని అర్ధం చేసుకోవాలన్నారు. నగరానికి పట్టిన జబ్బులు వదిలించే బాధ్యత విూపై పెడుతున్నానని కేసిఆర్‌ అధికారులకు చెప్పారు. హైదారబాద్‌లో  ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమాదారులపై వ్యవహరించాల్సిన పద్దతి, లీజ్డ్‌ ల్యాండ్స్‌ విషయంలో అనుసరించాల్సిన విధానం, అసైన్డ్‌ ల్యాండ్స్‌ తదితర అంశాలపై విధి విధానాలు రూపోందించే బాధ్యతను ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీకి అప్పగించారు. పొట్ట చేతబట్టుకుని హైదారబాద్‌కు వలస వచ్చినవారికి నిలువ నీడ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి చెప్పారు. హైదారాబాద్‌ నగరం పరిధిలో దాదాపు రెండు లక్షలకు పైగా పేద కుటుంబాలు గుడిసెలు,రేకుల షెడ్డులు వేసుకొని, ఇరుకు ఇండ్లలో ఉంటున్నారని చెప్పారు. వారికి మెరుగైన  ఆవాసాలు కల్సించాలన్నారు. ఆ మాత్రం కూడా నీడ లేని వారు మరో లక్షన్నర వరకు ఉంటారని వారంతా రైల్వే ప్లాట్ఫారాలపై,పుట్‌ పాత్‌లపై పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి రాత్రి వేళ ఆశ్రయం కల్పించడానికి నగరంలో 50 నైట్‌ షెల్టర్లు నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను అదేశించారు. ఈ సమావేశంలో మంత్రి ఈటేల, అధికారులు నర్సింగరావు, విూన, హైదరాబాద్‌, రంగారెడ్డి కలెక్టర్లు, గ్రేటర్‌ పరిలోని ఆర్డీవోలు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *