మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నా
ఆమె మొదటిసారి ఎన్నికైంది
క్షమాపణలు చెప్పింది.. శాంతించండి : ప్రధాని
న్యూఢిల్లీ, డిసెంబర్ 4 (జనంసాక్షి) : కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆందోళన ఆగలేదు. ‘మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. ఆమె మొదటిసారి పార్లమెంట్‌కు ఎన్నికైంది.. క్షమాపణలు చెప్పింది.. శాంతించండి’ అని ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో నిరంజన్ జ్యోతి క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. ఆమె చెప్పిన క్షమాపణను ఆమోదించాలని కోరారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలన్నారు. ఆమె చేసిన వివాదస్పద వ్యాఖ్యలను ఇప్పటికే తాను ఖండించానని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలు మనందరికీ గుణపాఠమని అన్నారు. భాష విషయంలో ప్రజాప్రతినిధులు సంయమనం పాటించాలని సూచించారు. అయినా విపక్షాలు శాంతించక పోవడంతో, వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… సభ సజావుగా సాగేందుకు సహరించాలని విపక్షాలను కోరారు. గత మూడు రోజులుగా సభా కార్యక్రమాలు జరగడం లేదని, ప్రధాని ప్రకటనను పరిగణనలోకి తీసుకుని విపక్ష సభ్యులు సభకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.పెద్దల సభలో కూడా ఇలా వ్యవహరించడం మంచిది కాదన్నారు. గురువారం సభ ప్రారంభం కాగానే నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై విపక్షాలు సభను అడ్డుకోవడంతో రాజ్యసభ స్తంభించింది. దీంతో సభ 15 నిమిషాలు వాయిదా పడింది. తర్వాత కూడా పరిస్థితి మారలేదు. చేసేదీలేక సభను మళ్లీ మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు.కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతిచేసిన వివాదస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలో విపక్షాలన్నీ విరుచుకుపడ్డాయి. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడి ఇప్పుడు క్షమాపణ చెబితే సరిపోతుందా అని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి ప్రశ్నించారు. రాజ్యాంగంపై విశ్వాసంలేని వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తారని నిలదీశారు. క్షమాపణ చెప్పారంటే తప్పు చేసినట్టేనని జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ అన్నారు. తప్పుచేసిన మంత్రిని క్షమాపణతో సరిపెడితే ఎలా అని ప్రశ్నించారు. నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసినా విపక్షాలు శాంతించలేదు. కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై లోక్‌సభలో కూడా దుమారం రేగింది. ఆమె రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా లోక్‌సభ నుంచి కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, వామపక్షాలు, ఆప్, ఐయూఎంఎల్ సభ్యులు వాకౌట్ చేశారు.





