Tuesday, 3 November 2026

బసవరాజు సారధిగా మావోయిస్ట్‌ పార్టీ కేంద్ర కమిటీ 

నూతన కార్యదర్శిగా గణపతి స్థానంలో నియామకం
అనారోగ్య కారణాలతో తప్పుకున్న గణపతి
లేఖ ద్వారా వెల్లడించిన పార్టీ ప్రతినిధి
హైదరాబాద్‌,నవంబర్‌28(జనంసాక్షి): మావోయిస్ట్‌ పార్టీ కేంద్ర కమిటీ నూతన కార్యదర్శిగా బసవరాజు అలియాస్‌ నంబాళ్ల కేశవరావును ఎన్నుకున్నట్లు ఆ పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ఓ లేఖలో వెల్లడించారు. ఇప్పటివరకు మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న గణపతి వయోభారంతో తప్పుకున్నారు. ఆయన సూచన మేరకు కొత్తసారధి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమం గతంలోనే ముగిసిని తాజాగా అధికారికంగా లేఖ ద్వారా వెల్లడించారు. గణపతి కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. పెరిగిన వయోభారాన్ని దృష్టిలో పెట్టుకుని పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారని మావోలు లేఖలో వివరించారు. గణపతి తన స్థానంలో మరోకరిని నియమించాలని సహచరుల ముందు ఓ ప్రతిపాదనను పెట్టారని, ఆయన ప్రతిపాదనను కేంద్రకమిటీ 5వ సమావేశం క్షుణంగా చర్చించినట్లు లేఖలో పేర్కొన్నారు. సుదీర్ఘంగా చర్చించిన కమిటీ నూతన కార్యదర్శిగా కేశవరావును ఎన్నుకున్నట్లు తెలిపారు.
కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియోనిపేట. ఆయన వరంగల్‌ ఆర్‌ఈసీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన చెరుకూరు రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ ప్రభావంతో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో చేరారు. నిర్బంధం తీవ్రం కావడంతో ఆయన 1980లో అజ్ఞాతంలోకి వెళ్లి.. 28 సంవత్సరాలుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. కేశవరావు ప్రస్తుతం సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. బసవరాజుగా పార్టీ శ్రేణుల్లో పరిచితుడయిన నంబాళ్ల మిలిటరీ దాడుల్లో దిట్ట. అందుకే కేశవరావుపై కేంద్ర ప్రభుత్వం రూ. కోటి రివార్డు ప్రకటించింది. కొంతకాలంగా మావోయిస్టు పార్టీని కేశవరావే నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం దాకా గణపతి తరువాత ఆ స్థాయి కలిగిన నాయకులు పొలిట్‌బ్యూరోలో నలుగురైదుగురు ఉండేవారు. నల్లా ఆదిరెడ్డి అలియాస్‌ శ్యామ్‌, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ, చెరుకూరు రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ పేర్లు అప్పట్లో అగ్రనాయకత్వ స్థానానికి ప్రస్తావనకు వస్తుండేవి. ఈ ముగ్గురూ ఎన్‌కౌంటర్లలో చనిపోయారు.  గణపతి కొద్ది సంవత్సరాలుగా పెరుగుతున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని, కేంద్రకమిటీని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ముందుచూపుగా తాను ఆ పదవి నుంచి స్వచ్చందంగా తప్పకున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ.. పీపుల్స్‌వార్‌గా ఏపీ, తెలంగాణలో పనిచేసిన తొలిరోజుల్లో ఆ పార్టీ పగ్గాలను కొండపల్లి సీతారామయ్య 60
ఏళ్ల వయసులో చేపట్టి… దశాబ్దానికిపైగా సారథ్యం వహించారు. సైద్దాంతిక విభేదాలతో కొండపల్లి తప్పుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ సానుభూతిపరులు చెబుతున్నారు. ఆయన తరువాత, పగ్గాలు చేపట్టిన గణపతి 1992 నుంచి పీపుల్స్‌వార్‌ను, అనంతరం ఆవిర్భవించిన మావోయిస్టు పార్టీని నడిపిస్తున్నారు. తాజా
పరిణామాల నేపథ్యంలో గణపతి ప్రస్థానం ముగిసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఇకపోతే ఇటీవల తీవ్ర ఒత్తడికి గురైన పార్టీ భౄరీ మూల్యాన్ని చెల్లించుకుంది. దీంతో మళ్లీ బసవరాజు సారథ్యంలో పార్టీ పుంజుకుంటుందని మావోయిస్ట్‌ పార్టీ భావిస్తోంది.