Tuesday, 3 November 2026

బస్సు రాడ్‌ తగిలి వ్యక్తి  మృతి

సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఘటన
హైదరాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): ఆర్టీసీ బస్సు ఇనుపరాడ్డు తగిలి వృద్ధుడు మృతిచెందాడు. ఆర్టీసీ డ్రైవర్‌ ఒక్కసారిగా బస్సు బ్రేక్‌ వేయడంతో రాడ్‌కు తగిలి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.  పోలీసుల కథనం ప్రకారం… మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన నరసింహ(60) సివిల్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తుంటాడు.  గురువారం రాణిగంజ్‌ డిపోకు చెందిన బస్సు రూట్‌ నెంబరు-37డి బస్సు ఎక్కి డ్రైవర్‌ పక్కనే సీనియర్‌ సిటిజన్‌ సీట్లో కూర్చున్నాడు. అయితే సంగీత్‌
చౌరస్తాకు  చేరుకున్న సమయంలో డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో సీటులో కూర్చున్న నరసింహ ఒక్కసారిగా ప్రయాణికులు బస్సు దిగే సమయంలో ఆధారంగా పట్టుకునే ఇనుప రాడ్‌ను ఢీకొని గాయపడ్డాడు. వెంటనే అతడిని ప్రయాణికులు గాంధీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలియజేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఎదురుగా ఉన్న ఇనుపరాడ్డు నరసింహ ముక్కుకు తగలడంతో బలమైన గాయమైంది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్దారించారు.  గోపాలపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.