బాబుకు నోటీసులు వెనుక.. 

మోడీ ఉన్నారనేది అవాస్తవం
– 22 వాయిదాలు కోర్టుకెళ్లకుంటే నోటీసులు కాక ఇంకేం జారీ చేస్తారు?
– కోర్టుకు హాజరుకాకపోవటం వల్లే సమన్లు వచ్చాయి
– ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
అమరావతి, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : బాబుకు నోటీసులు అందక వెనుక మోడీ ఉన్నారనేది అవాస్తవమని, కోర్టుకు హాజరుకాకపోవటం వల్లే సమన్లు వచ్చాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తూ వచ్చారని, చివరి 22 వాయిదాలకు వెళ్లకపోవడం వల్ల నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారంట్‌ జారీ చేశారని వెల్లడించారు.
కేవలం ముద్దాయిలు 22సార్లు కోర్టుకు వెళ్లకపోవడం వల్లనే వారెంట్‌ వచ్చిందని తెలిపారు. సాధారణంగా 3 సార్లు ముద్దాయిలు కోర్టుకు వెళ్లకపోతే నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ వస్తుందని వివరించారు. ఇప్పుడు కొత్తగా నోటీసుల వెనక మోదీ ఉన్నారని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు విూద కేసు కాంగ్రెస్‌ హయాంలో పెట్టిందని గుర్తు చేశారు. వాయిదాలకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులను అగౌరవపరిచేలా వ్యవహరించారని విమర్శించారు. ఆపరేషన్‌ గరుడ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, అసలు ఆపరేషన్‌ గరుడ అంటే ఏంటో చెప్పాలని తెదేపా నేతలను ప్రశ్నించారు. అరెస్టు వారెంట్‌లను కూడా చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకోవటం చూస్తుంటే సిగ్గుచేటన్నారు.

తాజావార్తలు