బాబు ప్రసంగాన్ని.. ఏపీ పోర్టల్‌లో ఎందుకు పెట్టలేదు
– ప్రకృతి వ్యవసాయానికి అన్నికోట్ల ఒప్పందమా?
– వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– 2019నాటికి పోలవరం పూర్తవుతుందని టీడీపీ నేతలు చెబుతుంటే.. ఇంజనీర్లే నవ్వుకుంటున్నారు
– విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
రాజమండ్రి, అక్టోబర్9(జనంసాక్షి) : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఎన్‌ఓలో ప్రసంగించిన అంశాన్ని ఏపీ ప్రభుత్వ పోర్టల్‌లో ఎందుకు పెట్టలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీరో బడ్జెట్ పేరిట నేచురల్ ఫార్మింగ్ గురించి వివరించి, రూ.16 వేల 600 కోట్ల ఎంవోయూను చంద్రబాబు, సిఫ్ సంస్థతో ఎందుకు చేసుకున్నారని సూటిగా అడిగారు. దేశం మొత్తం విూద వచ్చిన ఇన్వెస్ట్మెంట్లో 20శాతం మనకే వచ్చిందని,18లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు వచ్చాయని గతంలో చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం ప్రకటించండంటూ ఉండవల్లి పేర్కొన్నారు. ఇప్పటికైనా యదార్థాలు మాట్లాడాలని ఉండవల్లి కోరారు. ఇదేవిషయం గురించి ఆంధప్రదేశ్ రైతు సాధికార సంస్థను ప్రశ్నిస్తే ఆర్టీఐలోని సెక్షన్-8 ప్రకారం వివరాలు ఇవ్వడం కుదరదని చెప్పారని ఉండవల్లి వెల్లడించారు. రామోజీ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం గురించి 2005లో రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి తన ఆత్మకథలో రాసుకున్నారని తెలిపారు. రామోజీరావు శిక్షలకు అతీతుడు అనే పద్ధతిలో అందరూ వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు. 2019 నాటికి పోలవరం పూర్తవుతుందని టీడీపీ నేతలు చెబుతుంటే.. ఇంజనీర్లే నవ్వుకుంటున్నారని ఉండవల్లి అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల జనాన్ని పోలవరం ప్రాజెక్టు చూపించటానికి తీసుకు వెళ్లినందుకు 20కోట్ల రూపాయల వ్యయం చేయటం దారుణమన్నారు. చంద్రబాబు చేస్తున్న పనులతో అంతర్జాతీయంగా ఆంధప్రదేశ్ పరువు పోతోందని విమర్శించారు. రాష్ట్రంలో అసలు జరగని ప్రకృతి వ్యవసాయం కోసం రూ.16 వేల 600 కోట్ల ఒప్పందమా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో కుటుంబరావు నెం.2గా కొనసాగుతున్నారన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించాలని ఉండవల్లి సవాల్ విసిరారు.