– టీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం లేదు
– కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ ఏర్పాటుకాలేదు
– తెలంగాణ ప్రజల ఇబ్బందుల పరిష్కారంలో కేసీఆర్ విఫలం
– కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్
హైదరాబాద్, నవంబర్28(జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ గెలిస్తే తప్ప తెలంగాణ నిర్మాణం జరగదని కేంద్రమంత్రి, భాజపా సీనియర్ నేత సుష్మా స్వరాజ్ అన్నారు. తెలంగాణ ఎన్నికల పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ఆమె మాదాపూర్‌లో బుధవారం ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు వేల మంది యువత బలిదానం చేసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం 400మందినే గుర్తించిందన్నారు. రాష్ట్రం కోసం యువత చేసిన బలిదానాలను కూడా గుర్తించలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. తెలంగాణ సమాజం కోసమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది గానీ, కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తుల కోసం ఏర్పడలేదన్నారు. ఇక్కడి యువతకు ఉద్యోగాలు రాలేదుగానీ.. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం వచ్చాయని ఎద్దేవాచేశారు. తెలంగాణ సాధనలో బిజెపి కీలక పాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణ నిర్మాణం, అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని ఆమె అన్నారు. తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన సాగుతోందని ఆమె చెప్పారు. కెసిఆర్ కుమారుడు, అల్లుడు మంత్రులుగా, కుమార్తె ఎంపిగా రాజ్యమేలుతున్నారని ఆమె అన్నారు. కెసిఆర్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఆమె అన్నారు. టీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం లేదని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నెలకొన్న పరిస్థితి ఇప్పుడు లేదని, తెలంగాణను అడ్డుకున్నవారితో కలిసి టీఆర్‌ఎస్ పనిచేస్తోందని విమర్శించారు. అమరుల కుటుంబాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. ఒకే కుటుంబం పదవులన్నీ అనుభవిస్తోందని సుష్మాస్వరాజ్ ఆరోపించారు.
ఉగ్రవాదం వీడితేనే చర్చలు..
ఈ సందర్భంగా పాక్‌తో శాంతి చర్చల గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవని వ్యాఖ్యానించారు. శాంతి చర్చలు కావాలంటే ఉగ్రవాదం వీడాల్సిందేనని స్పష్టంచేశారు. అదే మన దౌత్య విధానం అని చెప్పారు. వారం క్రితం పంజాబ్‌లో ప్రార్థనాలయంలో దాడి చేశారని, అదీ ఉగ్రవాదుల పనేనని సుష్మ అన్నారు.




