ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్
రాజ్‌భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
యోగాసనాలు వేసిన గవర్నర్, రాజ్‌భవన్ ఉద్యోగులు
హైదరాబాద్, జూన్21(జనం సాక్షి) : బాల్యం నుంచే ధ్యానం, యోగా అలవర్చుకోవాలని, తద్వారా మంచి ఆరోగ్యంతో ఉత్సాహంగా జీవితాన్ని సాగించవచ్చునని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నర్సింహన్ అన్నారు. గురువారం రాజ్‌భవన్ ప్రాంగణంలోని సంస్కృతి భవన్‌లో నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఉదయం 7.30 నుంచి 8 గంటలపాటు ఉత్సాహపూరిత వాతావరణం నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐపీఎస్ అధికారులు, ఉన్నతాధికారులు, రాజ్‌భవన్ అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆచార్య రవిశంకర్ నేతృత్వంలో తొలుత గాయత్రి మంత్రం జపించి ధ్యానం, యోగాను గవర్నర్ ప్రారంభించారు. గవర్నర్ దంపతులు ధ్యానం, యోగా ఆసనాలు వేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన స్థానం పొందిన ధ్యానం, యోగా పక్రియల కలిగే ప్రయోజనాలను గవర్నర్ వివరించారు. అనంతరం రాజ్‌భవన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగా దినోత్సవంలో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థులు బాల్యం నుంచే ధ్యానం, యోగా పక్రియ అలవరుచుకోవాలని సూచించారు. ఇక నుంచి ఇలాంటి దినోత్సవాల సమయంలోనే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఓ భాగం కావాలని నరసింహన్ పిలుపునిచ్చారు. రోజూ కనీసం 10 నుంచి 30 నిమిషాలపాటు యోగా చేయడం వల్ల ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు సైతం దూరమై మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి
ఒక్కరూ ఈ పక్రియలు అలవరచుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా తప్పనిసరి చేయాలన్న యోగా సంఘాల అభ్యర్థనపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, తొలివిడతలో రెసిడెన్షియల్ స్కూళ్లల్లో ప్రవేశపెడతామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హావిూ ఇచ్చినట్లు యోగా అధ్యాపకులు రవికిషోర్ తెలిపారు.
బాల్యం నుంచే యోగా, ధ్యానం అలవర్చుకోవాలి




