బిజెపికి కనువిప్పు కావాలి: సోమిరెడ్డి
అమరావతి,మే19( జనం సాక్షి): కర్ణాటక పరిణామాలు బిజెపికి కనువిప్పు కావాలని ఎపి మంత్రి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం బిజెపికి చెంపపెట్టన్నారు. బలం లేకున్న సిఎంగా ప్రమాణం చేయడం ద్వారా బేరసారాలకు పాల్పడాలని చూశారని అన్నారు. రాష్ట్రానికి ఓ విధానం అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధినేతలు రంగంలోకి దిగినా విఫలమయ్యారని విమర్శించారు. గాలి జనార్ధన్ రెడ్డి వంటి అవినీతిపరులను బీజేపీ రంగంలోకి దింపారని విమర్శించారు. ప్రధాని లాంటి నేతలు అవినీతిని ప్రోత్సహిస్తే దేశానికి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. కర్ణాటకలో బేరం కుదిరితే ఇక అంతటా అదే ఫార్ములా వాడేవారని అన్నారు. యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయమని అన్నారు. ఇలాంటి అనైతిక రాజకీయాలకు ఇక ముగింపు పలకాలన్నారు.