Tuesday, 3 November 2026

బిజెపి జాబితాతో భగ్గుమన్న అసంతృప్తి

మండిపడ్డ నిజామాబాద్‌, శేరిలింగంపల్లి నేతలు

నిజామాబాద్‌లో కార్యాలయ ఫర్నీచర్‌ ధ్వంసం

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ భారతీయ జనతా పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. 28 మందితో భాజపా ఈరోజు రెండో విడత జాబితా విడుదల చేయడంతో తమ పేర్లు లేని వారు ఆందోళనకు దిగారు. జాబితాలో భాగంగా శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు, నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు అధిష్ఠానం కేటాయించింది. దీంతో ఈ రెండు స్థానాల్లో టిక్కెట్ల ఆశించి భంగపడిన నేతలు ఆందోళనకు దిగారు. ఇప్పటికే అనేక చోట్ల నేతలు మండిపడుతన్నారు. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు కేటాయించడంపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి నరేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న తనను కాదని.. మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన బిల్డర్‌ యోగానంద్‌కు టిక్కెట్‌ ఎలా కేటాయిస్తారంటూ ఆయన పార్టీ పెద్దలను నిలదీశారు. దీనికి నిరసనగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఎదుట మద్దతుదారులతో కలిసి ఆయన నిరసనకు దిగారు. యోగానంద్‌కు టిక్కెట్‌ కేటాయించడానికి గల కారణాలను పార్టీ తెలపాలని డిమాండ్‌ చేశారు. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను తనకే కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు కేటాయించడంపైనా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యెండలకు టిక్కెట్‌ కేటాయించడాన్ని నిరసిస్తూ సూర్యనారాయణ గుప్తా అనుచరులు ఆందోళన చేపట్టారు. భాజపా కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజక వర్గ భాజపా అభ్యర్థిగా యెండల లక్ష్మీనారాయణను పార్టీ అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. ఈయన గతంలో రెండు దఫాలు నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు యెండలకు టిక్కెట్‌ను కేటాయించటం పట్ల ధన్‌పాల్‌ సూర్యనారాయణ వర్గీయులు భాజపా కార్యాలయంలో దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సూర్యనారాయణ గత నాలుగున్నరేళ్లుగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారని.. ఆయనను కాదని యెండలకు టిక్కెట్‌ ఎలా కేటాయిస్తారని పలువురు నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.