Wednesday, 4 November 2026

బీజేపీకి ప్రత్యామ్నాయంగా.. రాజకీయ శక్తుల పునరేకీకరణ చేస్తున్నాం

– బాబు కృషికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది
– కేసీఆర్‌, అమిత్‌ షాల మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది
– బాబును విమర్శించే పరిపక్వత పవన్‌కు లేదు
– తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌
అమరావతి, నవంబర్‌3(జ‌నంసాక్షి) : మారుతున్న రాజకీయ పరిణామాణాలకు అనుగుణంగానే కాంగ్రెస్‌తో కలిసి వెళ్తున్నామని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ చెప్పారు. శనివారం ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడారు.. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకంచేసేందుకు చంద్రబాబు చేస్తున్న కృషికి మంచి స్పందన వస్తోందని తెలిపారు. చంద్రబాబు ప్రయత్నాన్ని దేశంలోని అన్ని పార్టీలు అభినందిస్తున్నాయని పేర్కొన్నారు. సమైక్య కార్యాచరణతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ చేస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్‌, అమిత్‌ షా మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని వ్యాఖ్యానించారు. జమిలీ ఎన్నికలను సమర్థించిన కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తున్నారన్నారు. కేసీఆర్‌ మోదీని, మోదీ కేసీఆర్‌ని పొగడుతున్నారని గుర్తుచేశారు. చంద్రబాబును విమర్శించే పరిపక్వత పవన్‌కళ్యాణ్‌కు లేదన్నారు. పవన్‌కు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ప్రజలను మోసం చేసిన బీజేపీతో
వైసీపీ, జనసేన, టీఆర్‌ఎస్‌ అంటకాగుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులపై పలుమార్లు కేంద్రాన్ని అడిగామని చెప్పారు. మోదీ ఆర్థిక విధానాల వల్లే రూపాయి విలువ పడిపోయిందని వెల్లడించారు. డిక్టేటర్‌షిప్‌తో ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సీబీఐ అధికారుల మధ్య గొడవలు పెట్టారని, అలాగే గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు.
/-రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటే కాపాడాల్సిన బాధ్యత మాపై ఉందని చెప్పారు. అవినీతిపరుడైన గాలిజనార్థన్‌రెడ్డిని ఎలా ప్రోత్సహిస్తారని ప్రశ్నించారు. విూపైనే అవినీతి ఆరోపణలు పెట్టుకుని ఎదుటివారిపై బురద జల్లాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో పదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పురందేశ్వరికి తెలుగువారి ఆత్మగౌరవం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. కన్నా ఏపార్టీలో చేరబోయి.. ఏ పార్టీలో చేరి అధ్యక్షుడు అయ్యాడో ప్రజలకు తెలుసని ఎద్దేవాచేశారు. అలాంటి కన్నా చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ఇచ్చే స్కిప్ట్‌ చదువుతారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని బీజేపీ, వైకాపా, జనసేనలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కనకమేడల హెచ్చరించారు.