రాజ్యసభకు నివేదిక సమర్పించిన సెలెక్ట్ కమీటి
వచ్చే వారం పెద్దల సభలో బిల్లు
దిల్లీ డిసెంబర్10 (జనంసాక్షి) : బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్.డి.ఐ.) పరిమితిని 49 శాతానికి పెంచేందుకు రంగం సిధ్దమయింది. ఈ మేరకు ఎఫ్‌డిఐలకు కేంద్రం ప్రభుత్వం ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతుంది. విదేశీ పెట్టుబడులపై ఉమ్మడి రిమితి విధించాలంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన సూచనల్ని జతచేసి ప్రభుత్వ బిల్లుకు పార్లమెంటరీ ప్యానెల్ ఆమోద ముద్ర వేసింది. ఎఫ్.డి.ఐ, పోర్ట్‌ఫోలియో పెట్టుబడి కలిపి 49% మించకూడదని ‘పార్లమెంటు ఎంపిక చేసిన సంఘం’ (సెలెక్ట్ కమిటీ) రాజ్యసభకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ప్రైవేటు బీమా సంస్థల్లో మాత్రం 26% ఎఫ్.డి.ఐ.ని అనుమతిస్తున్నారు. విదేశీ పెట్టుబడి పరిమితిని 49 శాతానికి పెంచడం వల్ల రూ.25,000 కోట్ల పెట్టుబడులను ఈ రంగంలో ఆకట్టుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి పరిమితి కోసం పట్టుపడుతున్న కాంగ్రెస్ పార్టీని సంతృప్తి పరిచేలా మార్పులు చేయడంతో ప్రభుత్వం ఈ కీలక బిల్లును వచ్చే వారమే రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. అధికార ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో తగినంత ఆధిక్యం లేని విషయం తెలిసిందే. బీమా బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ మద్దతు కీలకం. 2008 నుంచి ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. బీమా రంగంలో మరింతగా విదేశీ పెట్టుబడులను అనుమతించడాన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. సెలెక్ట్ కమిటీ నివేదికలోనూ సీపీఎం, టీఎంసీ, ఎస్పీ, జేడీయూ పార్టీల ప్రతినిధులు తమ అసమ్మతిని నమోదు చేశారు. సెక్యూరిటీల అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో బీమా రంగం నుంచి ఒకరిని నిపుణుడిగా నియమించాలని కమిటీ సిఫార్సు చేసింది. బీమా సంస్థలు చేసే నేరాలను బట్టి జరిమానాలు విధించేలా సెబీ చట్టాన్నీ సవరించాలని సూచించింది. ఏజెంట్ల కమీషన్ సహా పలు అంశాలపై సూచనలు చేస్తూ బిల్లును ఆమోదించవచ్చని అభిప్రాయపడింది.





