– బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలి
– బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
– బీసీలకు వ్యతిరేక ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి
హైదరాబాద్, డిసెంబర్29(జనంసాక్షి) : తెలంగాణ లో దొరల రాజ్యం తీసుకురావడానికే బీసీలకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పంచాయతీల్లో బీసీలకు 24శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తు తెచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌చేస్తూ.. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ శనివారం కలెక్టరేట్ ముట్టడి జరిగింది. ఈ ముట్టడిలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. బీసీ ఆశీర్వాదసభలు పెట్టి ఓట్లు వేయించుకున్న కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేశారన్నారు. బీసీ జన గణన చేపట్టాలన్నారు. సీఎస్ ను కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. బీసీ ఆగ్రహ మహాసభలు పెడుతాం, ఇంటింటి ప్రచారం చేస్తాం, ఎంపీ ఎలక్షన్ లో టీఆర్‌ఎస్ ను ఓడగొడుతామని పేర్కొన్నారు. కేసీఆర్ శ్రీరామ రక్ష అంటున్న తలసాని 34 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని కేసీఆర్ తో చెప్పించాలని, పాలాభిషేకం చేస్తామన్నారు. బీసీ లను రాజకీయ నాయకులు కాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం తరపున బీసీ రిజర్వేషన్ లపై సుప్రీంకోర్టు లో రిట్ పిటిషన్ వేయాలన్నారు. రాజకీయ రిజర్వేషన్ లు చేయాలన్నారు. బీసీ వ్యతిరేకులు స్వప్న రెడ్డి, గోపాల్ రెడ్డి రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా కోర్ట్ కు వెళితే తీర్పు వారికి అనుకూలంగా ఇస్తారని, మేము వెళితే మాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్నారు. కేసీఆర్ మోడీ కి ఇచ్చిన 16 డిమాండ్ లలో బీసీ రిజర్వేషన్ డిమాండ్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ లపై సీఎం అధ్యక్షత న అఖిల పక్షం ఏర్పాటు చేయాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. అనంతరం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. బీసీల ఓట్లతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. వారికే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తెలంగాణలో 88శాతం ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగుతోందని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రజా వ్యతిరేక ఆర్డినెన్స్‌ను తొలగించాలని పొన్నాల డిమాండ్ చేశారు. తెలంగాణలో దొరల రాజ్యం తీసుకురావడానికే కేసీఆర్ బీసీ రిజర్వేషన్లను తగ్గించి అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్ ఈ ఆర్డినెన్స్‌ను ఉపసంహారించుకోకపోతే బీసీ ఆగ్రహా సభల పేరుతో ఇంటింటి ప్రచారం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసను ఓడిస్తామని హెచ్చరించారు.
బీసీలకు వ్యతిరేక ఆర్డినెన్స్… దొరల రాజ్యం కోసమే




