Tuesday, 3 November 2026

బీసీలు ఎదగడం కేసీఆర్‌కు ఇష్టం లేదు

– కేబినెట్‌లో నామమాత్రపు పదవులు ఇచ్చారు
– కాంగ్రెస్‌ నేత వి. హన్మంతరావు
హైదరాబాద్‌, జూన్‌29(జనం సాక్షి) : రాజకీయంగా బీసీలు ఎదగడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇష్టం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. కేసీఆర్‌ తన కేబినెట్‌లో కూడా బీసీలకు నామమాత్రపు పదవులు ఇచ్చారన్నారు. దేవుడికి ఇచ్చిన హావిూలన్నీ అమలుచేస్తున్న కేసీఆర్‌… బీసీలకు ఇచ్చిన హావిూలు మాత్రం ఎందుకు తీర్చడం లేదని వీహెచ్‌
ప్రశ్నించారు. దేవునికి సేవ చేస్తున్న కేసీఆర్‌… ఓటరు దేవుణ్ణి మాత్రం మర్చిపోయారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు సీఎంకి పెట్టాలని ఉందా? వాయిదా వేయాలని ఉందా అని వీహెచ్‌ ప్రశ్నించారు.  సమగ్ర సర్వేలో 54 శాతం బీసీలు ఉన్నారని చెప్పిన సీఎం ఇపుడు దాటవేస్తున్నారని విహెచ్‌ విమర్శించారు.  ఉత్తమ్‌పై జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ… ఆయన మారడు అని కుంతియా చెప్పారు, కానీ కొంత మంది వ్యతిరేకంగా సమావేశాలు పెడుతున్నారని విహెచ్‌ ఆరోపించారు. ఇదే విషయమై కుంతియాకు పిర్యాదు చేస్తానన్నారు. రహస్య విూటింగ్‌ వెనక ఉన్న కుట్ర దారులను బయట పెట్టాలని, ఇలాంటివి పార్టీలో జరగడం సరికాదన్నారు వీహెచ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు తెరాసపై వ్యతిరేఖత పెరుగుతుందని, ప్రజలు కాంగ్రెస్‌ పాలనే మేలనుకుంటున్నారని విహెచ్‌ అన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్‌ నేతలు విబేధాలు వీడి ఒక్కతాటిపైకి వస్తే 2019లో అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాల ద్వారా కోట్లు దండుకుంటుందని విహెచ్‌ ఆరోపించారు. సీఎం గద్వాల పర్యటన సందర్భంగా అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ను గృహనిర్భందం చేయడం పట్ల విహెచ్‌ మండిపడ్డారు. ఇలాంటి చర్యలు సరికాదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అంటుండటం హస్యాస్పదంగా ఉందని విహెచ్‌ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో సహా తెరాస కూడా గల్లంతులు కోల్పోబోతుందని, కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగాఉన్నారని విహెచ్‌ జోస్యం చెప్పారు.