రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించిన బోనాల ఏర్పాట్లపై అధికార నివాసంలో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. బోనాల ఏర్పాట్ల పర్యవేక్షణకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులుగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తలసాని, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డిని నియమించారు.
బోనాల పండుగ సందర్భంగా దేవాలయాల దగ్గర ఏర్పాట్లు చేసేందుకు రూ. 10 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో దేవాదాయ శాఖ ద్వారా రూ. 5 కోట్లు, జీహెచ్‌ఎంసీ ద్వారా రూ. 5 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి ప్రదీప్ చంద్రను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
బోనాల పర్యవేక్షణ కమిటీ, జీహెచ్‌ఎంసీలతో కలిసి బోనాల పండుగను నిర్వహించాలని దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బోనాల సందర్భంగా దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. రహదారులు శుభ్రంగా ఉండేలా చూడాలని, దేవాలయాల దగ్గర మంచినీటి సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రులు నాయిని, తలసాని, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి హాజరయ్యారు.
బోనాల ఏర్పాట్లకు రూ. 10 కోట్లు





