Monday, 2 November 2026

బ‌ల్దియా క‌మిష‌న‌ర్‌ను క‌లిసి చైనా ప్ర‌తినిధి బృందం

DSC_8296 తెలంగాణ‌లో పెట్టుబ‌డుల నిమిత్తం ప‌ర్య‌టిస్తున్న 12మంది స‌భ్యుల చైనా ప్ర‌తినిధి బృందం నేడు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్ద‌న్‌రెడ్డిని క‌లిసింది. తెలంగాణ‌లో ముఖ్యంగా గ్రేట‌ర్‌ హైద‌రాబాద్ ప‌రిధిలో రాష్ట్ర ప్ర‌భుత్వం, జీహెచ్ఎంసి చేప‌డుతున్న ప‌లు ప్ర‌ధాన అభివృద్ది ప‌థ‌కాల‌లో  భాగ‌స్వామ్యం కావ‌డానికి ఈ చైనా ప్ర‌తినిధి బృందం ఆస‌క్తిని క‌న‌ప‌ర్చింది. చైనాలోని ప్ర‌ముఖ న‌గ‌ర‌మైన చంగ్‌షా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం డైరెక్ట‌ర్ లియూమింగ్లీ, చైనీస్ పీపుల్స్ పొలిటిక‌ల్ క‌న్స‌ల్టేటివ్ విదేశీ వ్య‌వ‌హ‌రాల డైరెక్ట‌ర్ జీలిహ్వా, చంగ్‌షా కామర్స్‌బ్యూరో వైస్ డైరెక్ట‌ర్ పెంగ్‌క‌జియా నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందం జీహెచ్ఎంసి కార్యాల‌యంలో క‌మిష‌న‌ర్‌ను క‌లిసి హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జా ర‌వాణా రంగంపై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ దాదాపు 6వేల కోట్ల ప్ర‌తిపాధిత అంఛ‌నా వ్య‌యంతో న‌గ‌రంలోని మూసిన‌దిపై ఈస్ట్‌-వెస్ట్ కారిడార్‌ను నిర్మించ‌నున్నామ‌ని తెలిపారు. ఈ మూసి అభివృద్ది రంగంలో భాగ‌స్వాములు కావాల్సిందిగా చైనా ప్ర‌తినిధి బృందానికి క‌మిష‌న‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో 9వేల కిలోమీట‌ర్ల రోడ్ల విస్తీర్ణం ఉంద‌ని, ఈ రోడ్ల నిర్వ‌హ‌ణ‌, మ‌ర‌మ్మ‌తులు త‌దిత‌ర ప‌నుల నిర్వ‌హ‌ణ‌ను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా చేప‌ట్టాల‌ని సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యించామ‌ని, ఈ రంగంలో కూడా భాగ‌స్వాములు కావాల‌ని చైనా బృందానికి క‌మిష‌న‌ర్ తెలిపారు. వీటితో పాటు 400సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎన్నో ప‌ర్యాట‌క ప్రాంతాలు ఉన్నాయ‌ని, హైద‌రాబాద్ న‌గ‌రానికి సంస్కృతి, సాంప్ర‌దాయాల ప‌రంగా ప్ర‌త్యేక గుర్తింపు ఉంద‌ని వివ‌రించారు. ప‌ర్యాట‌క‌, వార‌స‌త్వ క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ‌, అభివృద్ది రంగంలో కూడా విస్తృత అవ‌కాశాలు ఉన్నాయ‌ని డా.జ‌నార్ద‌న్‌రెడ్డి వారికి వివ‌రించారు. వీటితో పాటు న‌గ‌రంలో దాదాపు 26వేల కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ఎస్ఆర్‌డిపి ప్రాజెక్ట్ ప‌నుల‌ను చేప‌డుతున్నామ‌ని, ఈ రంగంలో కూడా పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం ఉంద‌ని అన్నారు. అన్యూటి ప‌ద్ద‌తిలో ఈ ప్రాజెక్ట్‌లు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని క‌మిష‌న‌ర్ వారికి సూచించారు. ఈ స‌మావేశంలో చంగ్‌షా న‌గ‌ర ప్లానింగ్ అండ్ క‌న్స్‌ట్ర‌క్ష‌న్‌తో పాటు ప‌లు కంపెనీల ప్ర‌తినిధులు క‌మిష‌న‌ర్‌ను క‌లిసిన‌వారిలో ఉన్నారు. జీహెచ్ఎంసి అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ సురేంద్ర‌మోహ‌న్‌, చీఫ్ ఇంజ‌నీర్ సురేష్ త‌దిత‌రులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *