టిడిపి,టిఆర్‌ఎస్ కార్యకర్తల ఘర్షణ
పోలీసుల రాకతో సద్దుమణిగిన వివాదం
హైదరాబాద్,నవంబర్ 28(జనంసాక్షి): ఇంతవరకు సాఫీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా అపశృతి చోటుచేసుకుంది. శేరిలింగపల్లిలో నియోజకవర్గంలో టీడీపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో నగరంలోని కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కమిటీ హాల్లో తెదేపా, తెరాస వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బుధవారం ఉదయం తెదేపా నేతలు ప్రచారం నిర్వహిస్తుండగా స్థానిక కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్ వారిని ప్రశ్నించేందుకు వెళ్లారు. దీంతో వెంకటేశ్‌పై తెదేపా వర్గీయులు దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శేరిలింగపల్లిలోని ఆల్విన్ సొసైటీ కార్యాలయంలో ఉదయం కొందరు టీడీపీ నాయకులు అల్పహార విందు ఏర్పాటు చేశారు. టీడీపీ విందు కార్యక్రమం గురించి తెలుసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. టీడీపీ ఎన్నికల నియమావళిని ఉల్లఘింస్తుందని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు ఆల్విన్ సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరస్పర విమర్శలతో ఒక్కసారిగా ఆల్విన్ సొసైటీ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున అరికెపూడి గాంధీ, టీడీపీ నుంచి వెనిగళ్ల ఆనంద్‌ప్రసాద్ బరిలో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.
శేరిలింగంపల్లి ప్రచారంలో ఉద్రిక్తత




