Monday, 2 November 2026

భారత్‌ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోంది

– మోదీని కలిసేందుకు విదేశీ నాయకులు ఆసక్తి చూపుతున్నారు
– నాలుగేళ్లలో 7.25కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం
– 80కోట్ల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేశాం
– ట్రిపుల్‌ తలాక్‌ మతానికి సంబంధించినది కాదు.. మహిళల సమస్య
– అందుకే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాం
– ఏపీలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయితే విభజన నోటిఫై చేస్తాం
– రాహుల్‌ ప్రధాని అవుతానని చెప్పుకోవటంలో మాకేం అభ్యంతరం లేదు
– మూడో కూటమి దేశంలో సాగేది కాదు
– దేశానికి హైదరాబాద్‌ ఐటీ సిటీగా మారింది
– వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం
– కేంద్ర మంత్రి రవిశంకర్‌
హైదరాబాద్‌, మే31(జ‌నం సాక్షి): ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు విదేశీ నాయకులు ఆసక్తి చూపుతున్నారని, భారత్‌ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏం చేశామో ప్రజలకు చెబుతున్నామని తెలిపారు. 31 కోట్ల పేద ప్రజలకు జన్‌ధన్‌ ఖాతాలు ఇచ్చామన్నారు. ఆధార్‌కార్డు వివరాలను గోప్యంగా ఉంచామని, దేశంలో 120 మొబైల్‌ తయారీ యూనిట్లు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. దేశంలో అన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా చేసినట్టు తెలిపారు. నాలుగేళ్లలో దేశంలో 7.25 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని, రెండు లక్షల కిలోవిూటర్ల మేర ఆప్టికల్‌ పైబర్‌ ఏర్పాటు చేశామని వివరించారు. 80 కోట్ల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌అనుసంధానం చేసినట్టు చెప్పారు.పేద, మధ్యతరగతి ప్రజలకు 3.5కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో ప్రపంచానికి యోగాను పరిచయం చేశామని అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ మతానికి సంబంధించిన సమస్య విషయం కాదని, మహిళలకు సంబంధించిన సమస్యగా భావించి పార్లమెంట్‌లో బిల్లుపెట్టామని వివరించారు. దీన్ని అన్ని పార్టీల మహిళా నాయకులూ సమర్థించారని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం బలోపేతానికి సవరణలు చేశామని, విద్య, వైద్య రంగంలో నాణ్యత పెంచామని అన్నారు. దేశం ప్రగతిపథంలో పయనిస్తోందన్నారు. దేశానికి హైదరాబాద్‌ ఐటీ సిటీగా మారిందన్నారు. దేశంలోని చిన్న పట్టణాలకు కూడా ఐటీని విస్తరించినట్టు తెలిపారు.  వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని స్పష్టంచేశారు. ఉప ఎన్నికల ఫలితాలు స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని, సాధారణ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తంచేశారు. మూడో కూటమి దేశంలో సాగేది కాదని, తాము ఎవరి ముందూ వెనకా లేమన్నారు.హైకోర్టు విభజనపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. ఐటీఐఆర్‌విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసేదేవిూ లేదని, విధానపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకున్నామని అన్నారు. భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిపారు. హైకోర్టు విభజనలో ఏపీ స్థలం ఇస్తే నోటిఫై చేయడం తప్ప చేసేదేవిూ లేదన్నారు. ప్రస్తుతం హైకోర్టు విభజన అంశం సుప్రీంకోర్టులోనే ఉందని తెలిపారు. అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయితే విభజన నోటిఫై చేస్తామన్నారు.