భారత్ వృద్ధిరేటు 7.3శాతం
– వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నిలుస్తుంది
– ఐఎంఎఫ్ అంచనా
వాషింగ్టన్, అక్టోబర్9(జనంసాక్షి) : భారత్ ఈ ఏడాది 7.3శాతం వృద్ధిరేటు సాధించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేసింది. 2019లో వృద్ధిరేటు 7.4శాతానికి పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికలో వెల్లడించింది.
2017లో భారత్ 6.7శాతం వృద్ధిరేటును సాధించింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐఎంఎఫ్ 2018 ఏప్రిల్‌లో ఇచ్చిన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికతో పోలిస్తే 2019లో వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. భారత్‌లో అమలవుతున్న ముఖ్యమైన సంస్కరణలను ఐఎంఎఫ్ నివేదికలో పేర్కొంది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు, ద్రవ్యోల్బణం తగ్గింపు లక్ష్యంగా ప్రణాళిక, దివాలా స్మృతి చట్టం, విదేశీ పెట్టుబడుల సరళీకరణ తదితర అంశాలను ఐఎంఎఫ్ వెల్లడించింది. తమ అంచనాలు నిజమైతే భారత్ త్వరలోనే తిరిగి ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచే అవకాశం ఉందని తెలిపింది. చైనాను 2018లో 0.7శాతం తేడాతో దాటిపోనుందని తెలిపింది. 2019లో మరో 1.2శాతం వృద్ధిరేటు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2017లో చైనా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్ కంటే 0.2శాతం ఎక్కువగా 6.9శాతం వృద్ధిరేటు సాధించింది. కాగా ఈ ఏడాది చైనా 6.6శాతం వృద్ధిరేటు మాత్రమే సాధించే అవకాశం ఉందని, 2019లో అది 6.2శాతానికి పడిపోయే అవకాశం ఉందని ఐఎంఎఫ్ నివేదికలో పేర్కొంది. అమెరికా చైనాపై విధిస్తున్న సుంకాల ప్రభావమూ ఆ దేశ వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది.