Tuesday, 3 November 2026

భారీ లాభాలతో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జూన్‌29(జనం సాక్షి) :  మదుపర్ల కొనుగోళ్ల అండతో దేశీయ మార్కెట్లు వరుస నష్టాల నుంచి శుక్రవారం తేరుకున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాలు కూడా సానుకూలంగా ఉండటం మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చింది. దీంతో జులై డెరివేటివ్‌ సిరీస్‌ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. ఆరంభం నుంచే జోరు సాగించిన మార్కెట్లు.. శుక్రవారం నాటి సెషన్లో భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. శుక్రవారం ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ కూడా 10,600 మార్క్‌ పైనే ట్రేడ్‌ అయ్యింది. మరోవైపు ఐరోపా మార్కెట్లు లాభాల్లో ఉండటంతో మధ్యాహ్నం సమయానికి దేశీయ మార్కెట్లు మరింత పుంజుకుని భారీ లాభాల దిశగా సాగాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 10,700 మార్క్‌ను దాటింది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 386 పాయింట్లు ఎగబాకి 35,423 వద్ద, నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 10,714 వద్ద స్థిరపడ్డాయి. మే 31 తర్వాత సెన్సెక్స్‌కు ఇదే అత్యధిక లాభం. డాలర్‌తో రూపాయి మారకం విలువ కాస్త మెరుగుపడి రూ. 68.48గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో గెయిల్‌, టైటాన్‌, హిందాల్కో, బజాజ్‌ ఆటో, టాటాస్టీల్‌ షేర్లు లాభపడగా.. రెడ్డీస్‌ ల్యాబ్స్‌, టెక్‌ మహింద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హీరోమోటార్స్‌, మహింద్రా అండ్‌ మహింద్రా షేర్లు నష్టపోయాయి.