Tuesday, 3 November 2026

భార్యను హత్య చేసి సౌదీకి చెక్కేసిన భర్త

నిందితుడిని రప్పించేందుకు పోలీసుల కసరత్తు
హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి): భార్యను హత్యచేసి సౌదీకి పారిపోయిన వ్యక్తిని రప్పించేందుకు నగర పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మేరకు విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు.  మహిళా హత్యకేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి దక్షిణ మండల పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసుగా నమోదై … డబీర్‌పుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హత్యకు గురైన జబీనాజ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా  ఆమె భర్త అక్బర్‌అలీని గుర్తించారు. అతను  ప్రస్తుతం సౌది అరేబియాలో తలదాచుకున్నాడు. ఈ నెల 17న నగరానికి వచ్చి 18న జజీనాజ్‌ను హత్య చేసి… 19 తెల్లవారుజామున సౌదికి పారిపోయాడు. మృతదేహాన్ని డబీర్‌పురలోని అక్బర్‌అలీఖాన్‌ ఇంటి నుంచి తరలించిన ఆటోను సీసీ ఫుటేజీల్లో గుర్తించిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను విచారించడంతో జబీనాజ్‌ హంతకుల గురించి పోలీసులకు తెలిసింది. ఈ కేసులో జబీనాజ్‌ను హత్య చేయడానికి అక్బర్‌అలీఖాన్‌ను ప్రేరేపించిన ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించా రు. పోలీసుల ముందు అక్బర్‌అలీఖాన్‌ స్వచ్ఛందంగా లొంగిపోవడానికి అతనికి వారం రోజులు గడువు విధించినా.. అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ప్రత్యేకంగా ఓ టీంను సౌదికు పంపడానికి దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ ఉన్నతాధికారుల అనుమతులను పొందారు. అందుకు అవసరమైన చర్యలను చేపట్టడానికి సౌది ఎంబసీ అధికారులతో సైతం నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. అక్బర్‌అలీఖాన్‌ అరెస్ట్‌ జరిగితే పోలీసులు మరెన్నో కేసులను పరిష్కరించే అవకాశం ఉంటుందని డీసీపీ తెలిపారు. వివాహాలు చేసుకుని ఉద్యోగరీత్యా సౌది అరేబియాకు వెళ్లిన నగర వాసు లు తమ భార్యలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ అనేక ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో…. ఆ కేసులో సైతం విదేశాల్లో తల దాచుకుంటున్న వారిని నగరానికి తరలించడానికి అవకాశం ఏర్పడుతుందని డీసీపీ సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. అక్బర్‌అలీఖాన్‌ కేసును ఛాలెంజ్‌గా స్వీకరించి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు.