మంత్రివర్గం నుంచి డీఎల్‌ వెలి

విదేశీ పర్యటనలో ఉండగానే…
గవర్నర్‌ ఆమోదం
మరో ఇద్దరిపై త్వరలో వేటు?
అధిష్టానంతో భేటీ తర్వాత ఉగ్ర కిరణ్‌
˜్‌హైదరాబాద్‌, జూన్‌ 1 (జనంసాక్షి) :
అధిష్టానంతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. నిత్యం ఆరోపణలతో ప్రభుత్వాన్ని, తనను ఇరుకున పెడుతున్న మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. తన కంట్లో నలుసులా మారిన డీఎల్‌ను మంత్రిమండలి నుంచి వెలి వేశారు. ఈ మేరకు గవర్నర్‌ నరసింహన్‌కు ముఖ్యమంత్రి సిఫారసు లేఖ పంపారు. ముఖ్యమంత్రి నుంచి బర్తరఫ్‌ లేఖ అందిన కొద్దిసేపటికే దానికి నరసింహన్‌ ఆమోదముద్ర వేసినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడిరచాయి. దీంతో రవీంద్రారెడ్డిపై అధికారికంగా వేటు పడిరది. రెండు రోజుల పాటు హస్తినలో గడిపిన సీఎం కిరణ్‌ రాష్ట్రంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. మంత్రివర్గంలో తన జట్టును నియమించుకునే అవకాశం ఇవ్వాలని కోరాడు. దీనిపై ఆచితూచి స్పందించిన అధిష్టానం మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకోవాలని కోరింది. డీఎల్‌ను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు మాత్రం ఢల్లీి పెద్దలు పచ్చజెండా ఊపారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సీఎం మంత్రివర్గంలో ప్రక్షాళన చేయబోతున్నట్టు సంకేతాలిచ్చాడు. ముందుగా డీఎల్‌పై వేటు వేసి మరో ఇద్దరు మంత్రులను తప్పించబోతున్నట్టు సహచరుల ద్వారా మీడియాకు లీకులు ఇప్పించాడు. దీంతో సీఎంతో ఉప్పునిప్పులా వ్యవహరిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్యపై కూడా వేటు తప్పకపోవచ్చనే ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సీఆర్‌ను తప్పించే పక్షంలో శాసన మండలి నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సీఆర్‌ను తప్పించేందుకు చిరంజీవి అంగీకరించని పక్షంలో తెలంగాణ ప్రాంతం నుంచి పీఆర్పీ పక్షాన గెలిచిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఈరవత్రి అనిల్‌కు మంత్రి పదవులు సీఎం ఇవ్వజూపనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయలేదని, ముఖ్యమంత్రితో వ్యక్తిగతంగా విభేదించలేదని డీఎల్‌ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన లండన్‌ పర్యటనలో ఉన్నారు. ఈనెల 4న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. మంత్రిగా బ్రిటన్‌ పర్యటనకు బయల్దేరిన డీఎల్‌ మాజీగా స్వరాష్ట్రానికి తిరిగి రానున్నారు. రవీంద్రారెడ్డి ఇప్పటివరకు నిర్వహిస్తున్న ఆసుపత్రి సేవలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యబీమా బాధ్యతలు మరో మంత్రికి కొండ్రు మురళీమోహన్‌కు అప్పగిస్తూ సీఎం కిరణ్‌ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ మలి విడత చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో తమ అదృష్టం పరీక్షించుకోవాలని పలువురు ఆశావహులు అప్పుడే హస్తిన పెద్దలతో లాబీయింగ్‌ ప్రారంభించారు.