
– పోర్టు నిర్మాణానికి రైతులు సహకరించాలి
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– ఉల్లిపాలెం- భవానీపురం వంతెనను ప్రారంభించిన సీఎం
కృష్ణా, నవంబర్21(జనంసాక్షి) : మచిలీపట్నం పోర్టును పూర్తిచేసి తీరుతామని ఏపీ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం కృష్ణా జిల్లాలో బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఉల్లిపాలెం-భవానీపురం వంతెనను ఆయన ప్రారంభించించారు. బందరు-అవనిగడ్డ నియోజకవర్గాల్లోని గ్రామాలను కలుపుతూ ఈ వంతెన నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రూ.77 కోట్లతో 20 గ్రామాలను కలుపుతూ వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు. మచిలీపట్నం పోర్టును పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతులు మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం త్యాగం చేశారని కొనియాడారు. పోర్టు నిర్మాణానికి ప్రజలు, రైతులు సహకారాన్ని అందించాలని కోరారు. భూముల ధరలు పెరుగుతాయి కదా అని ఇంట్లో కూర్చుంటే అభివృద్ధి జరగదన్నారు. మచిలీపట్నం, అవనిగడ్డను పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామన్నారు. విజయవాడలో బోట్ రేసులకు మంచి స్పందన వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు ఉల్లిపాలేం ఎంపీయూపీ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఉత్తర అమెరికా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి ఆధ్వర్యంలో ఎన్నారైలు రాష్ట్రంలో ఇప్పటికే 3500 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఇప్పటికే సుమారు 200 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ నిర్వహిస్తున్నారు. పాఠశాలలో మరో 240 డిజిటల్ తరగతి గదుల్లో టచ్ స్కీన్ర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉల్లిపాలేం డిజిటల్ తరగతి కోసం చండ్ర దిలీప్ కుమార్ డెబ్భై వేలు విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో డిజిటల్ విధానంలో పాఠ్యాంశాల భోధనను యానిమేషన్ విధానంలో భోదించారు.
మచిలీపట్నం పోర్టును పూర్తిచేసి తీరుతాం




