Tuesday, 3 November 2026

మధులిక కోలుకుంటుంది

– వైద్య బృందం నాలుగు సర్జరీలు చేశారు
– పూర్తిగా కోలుకోవాలంటే సమయం పడుతుంది
–  యశోద హాస్పిటల్‌ సీఓఓ విజయ్‌కుమార్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక కోలుకుంటోందని యశోదా ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. శుక్రవారం యశోద హాస్పిటల్‌ సీఓఓ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 48గంటల వైద్యుల శ్రమ ఫలితానికి మధులిక ఆరోగ్యం మెరుగు పడిందని తెలిపారు. సుమారు ఏడు గంటల పాటు ఐదుగురు సభ్యుల వైద్య బృందం నాలుగు సర్జరీలు చేశారని, సర్జరీల తర్వాత మధులిక పూర్తిగా కోలుకుందని చెప్పారు. డాక్టర్లు అడిగినదానికి సైగలు చేస్తోందన్నారు. బ్రెయిన్‌పై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశామని, ప్రస్తుతం మధులిక ఆరోగ్యం కుదట పడిందని విజయ్‌ వెల్లడించారు. మరో 48 గంటల పాటు ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని, ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం ఉందన్నారు. మధులికకు ఇప్పటి వరకు 28యూనిట్లు రక్తాన్ని ఎక్కించామని చెప్పారు. నాలుగు సర్జరీలు చేశారు కాబట్టి ఆమె పూర్తిగా కోలుకోడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. మధులిక ఇంకా వెంటిలేటర్‌పైనే ఉందని, శనివారం మధ్యాహ్నం వరకు ఆమెను వెంటిలేటర్‌పైనే ఉంచనున్నట్లు యశోద హాస్పిటల్‌ సీఓఓ విజయ్‌ కుమార్‌ తెలిపారు.