అన్నిపనులను పూర్తి చేయడమే తక్షణ కార్యక్రమం
హరితహారం,రైతుబీమా, మిషన్ భగరీథ కోసం శ్రమిస్తున్నాం: జోగురామన్న
ఆదిలాబాద్,జూన్14(జనం సాక్షి): ఈ యేడు ప్రభుత్వానికి సంబంధించి ఎంతో కీలకమైనదని రాష్ట్ర అటవీ , బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు పూర్తి చేసిన తాము ఇక హరితహారం,మిషన్ భగీరథ, రైతుబీమా పథకాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.ఈ మూడు కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగబోతున్నాయని అన్నారు. సిఎం కెసిఆర్ చేపట్టిన అన్ని పనులు విజయలక్ష్యంతో పూర్తి కావడం ఆయన టీమ్‌లో పనిచేస్తున్న తమకు కూడా గర్వంగా ఉందని గురువారం నాడిక్కడ ఆయన అన్నారు. రుతు బీమా సర్వే చురకుగా సాగుతోందన్నారు. గ్రామాల్లో అధికారులు వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. భావి తరాల మనుగడ కోసమే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. అటవీ శాఖ అధికారులు, పోడు వ్యవసాయ రైతులలు ఇందులో భాగం కావాలన్నారు. గ్రామాల్లో మొక్కల సంరక్షణకు హరిత గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సర్పంచ్, ఎంపీటీసీలను సభ్యులగా చేయాలని అటవీ శాఖ అధికారులకు సూచించామని అన్నారు. నాలుగో విడతలో 72 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అడవుల్లో మొక్కలను పెంచేందుకు సీడ్ బాల్స్‌ను వేసి సంరక్షణకు కంచెలను ఏర్పాటు చేయాలన్నారు. దీంతో అటవీ శాఖ, పోడు వ్యవసాయం చేసుకునే రైతుల సరిహద్దుల సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న అర్హులైన గిరిజన రైతులు 3315 మందికి చెక్కులను అందజేసేందుకు ప్రణాళిక చేశామన్నారు. పోడు సాగు చేసుకుంటూ అటవీ హక్కు పత్రాలు ఉన్న రైతులను ఆదుకుంటామని మంత్రి జోగు రామన్న అన్నారు. ఇప్పటికే అటవీ హక్కు పత్రాలు ఉన్న రైతులను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటామని, కొత్తగా అడవుల నరికి పోడు సాగు చేస్తున్న వారిని మాత్రం అడ్డుకుంటామన్నారు. కొంతమందికి పెట్టుబడి చెక్కులు రాలేదని, సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసి ప్రజలకు నిర్దేశిత గడువులోగా తాగునీరు అందించనున్నట్లు మంత్రి జోగు రామన్న అన్నారు. ఓహెచ్‌ఎస్‌ఆర్, పంపుల నిర్మాణాలు, పైపులైన్లు, ఇంటింటికీ కనెక్షన్ వంటి పనులను వేగవంతం చేసేందుకు ఎక్కువ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటింటికీ సరఫరా చేసే కాంపోనెంటులను త్వరగా సమకూర్చుకోవాలని తెలిపారు. నిర్దేశించిన గడువు నాటికి ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించు కోవాలని అధికారులకు చెప్పారు. గ్రామాల పర్యటనలో మిషన్ భగీరథ పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే, ఓహెచ్‌ఎస్‌ఆర్ వరకు వచ్చిన బల్క్ వాటర్‌ను ఇంటింటికీ సరఫరా చేసేందుకు అవసరమైన పరికరాలను వెంటనే తెప్పించుకొని, స్థానిక ప్రజాప్రతినిధులతో నీటి సరఫరాను ప్రారంభించాలని తెలిపారు. ఇంట్రాగ్రిడ్ పనులను, ఇతర పనులు జూలై 25 నాటికి పూర్తి చేయాలన్నారు. రిమ్స్‌కు కావాల్సిన నీటిని సరఫరా చేయాలని మున్సిపల్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లను ఆదేశించారు. 33 మారుమూల గిరిజన గ్రామాలకు నీటి సరఫరాకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి సూచించారు.




