విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బుధవారానికి మరో రూ.1600కోట్ల నగదు రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం నగదు రహిత లావాదేవీలపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత శనివారం వచ్చిన రూ.2,500 కోట్ల నగదు అన్ని బ్యాంకుల శాఖలకు పంపిణీ జరిగిందన్నారు. ఇందులో రూ.500కోట్లు ఐదువందల నోట్లే ఉన్నాయని, ఈరోజు ఉదయం అన్ని ఏటీఎంలలో నగదును నింపడం జరిగిందన్నారు. బుధవారం రానున్న నగదులోనూ రూ.500 నోట్లు ఐదువందల కోట్లు ఉంటాయని తెలిపారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలకు, నగదు చెల్లింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నగదు చెల్లింపులకు కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అన్ని రైతు బజార్లను నగదు రహితం చేయాలని ఆదేశించారు. రైతు బజార్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని, అన్ని విశ్వవిద్యాలయాలు నగదు రహితం కావాలన్నారు. చాలా యూనివర్సిటీల్లో ఇప్పటికే వైఫై సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు ఫైబర్ గ్రిడ్ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. కేబుల్, ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే నగదు రహిత లావాదేవీలు మరింతగా పెరుగుతాయన్నారు. మొబైల్ ట్రాన్సాక్షన్స్ 1.60లక్షలకు పెరగడం సంతోషకరమని బాబు హర్షం వ్యక్తం చేశారు. బ్యాంకర్లు, ఆర్థిక శాఖ, సెర్ఫ్, మెప్మా సిబ్బంది సమన్వయంగా పనిచేయాలని, రబీపనులకు నగదు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లు, ఆర్ధిక శాఖ అధికారులు పాల్గొన్నారు.




