మళ్లీ కాంగ్రెస్ గూటికి ధర్మపురి?
బిసి ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్
రాహుల్ రాగానే చేరికపై నిర్ణయం
ఈలోగా టిఆర్ఎస్తో అవిూతువిూకి సిద్దం
పార్టీ పగ్గాలు అందుకుని పోరాడేలా వ్యూహం
కాంగ్రెస్‌లోనూ సానుకూల వైఖరి
హైదరాబాద్,సెప్టెంబర్5(జనం సాక్షి): కాంగ్రెస్ ముందస్తు ఎన్నికల దూకుడులో పావులు కదుపుతోంది. పాతకాపులను తిరిగి పార్టీలోకి రప్పించే క్రమంలో ప్రస్తుతం టిఆర్ఎస్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డిఎస్‌ను కూడా తిరిగి కాంగ్రెస్‌లోకి రప్పించే ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. తెలంగాణ ఏర్పాటు కాకముందు రెండు ఎన్నికల్లో డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనను మళ్లీ అదే సెంటిమెంట్‌తో రప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే రాహుల్‌తో చర్చలు పూర్తయ్యాయని, ఆయన చేరికపై త్వరలోనే క్లారిటీ రానుందని తెలుస్తోంది. ప్రధానంగా బిసిల ఓట్లను దృష్టిలో పెట్టుకుని డిఎస్‌ను కాంగ్రెస్‌లోకి రప్పించే యత్నాలు జరిగాయని అంటున్నారు. యాదృఛ్చికమే అయినా డిఎస్ నిజామాబాద్ మున్నూరు కాపు సంఘ భవన్లో తన అనుచరులతో కలసి విూడియాతో మాట్లాడారు. బిసిలను మచ్చిక చేసుకునే యత్నాల్లో భాగంగా ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తున్నట్లుగా గుర్తించాలి. ఎపిలో ఒక్కొక్కరుగా తిరిగి పార్టీలో చేరుతున్నారు. అదే తరహాలో తెలంగాణలో కూడా మళ్లీ డిఎస్ తదితరులను రప్పించి పార్టీని ఎన్నికల యుద్దానికి సిద్దం చేయబోతున్నారు. టిఆర్ఎస్లో చేరినా ,రాజ్యసభ ఇచ్చినా ఎలాంటి బాధ్యతాయుతమైన పదవిలో డిఎస్ లేరు. పైగా ఆయనను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంచారు. ఈ నేపథ్యంలో డిఎస్ కూడా మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు గతంలోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా రాయబేరం నడిపినట్లు వార్తుల వచ్చాయి. మొత్తంగా ఇప్పుడు తాజా పరిణామాలు,, ఆయన టిఆర్ఎస్ పార్టీకి విసిరిన సవాళ్లను పరిశీలిస్తే రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నా రన్నది స్పష్టంగా తెలుస్తోంది. బహుశా ఈ విషయం తెలిసే సిఎం కెసిఆర్ కూడా ఆయనతో ముభావంగా ఉంటూ వస్తున్నారని సమాచారం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే డిఎస్ కాంగ్రెస్‌లో చేరనున్ననట్లు తెలుస్తోంది. ఈనెల 12 లేదా 13న కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. రాహుల్ సమక్షంలో డీఎస్ పార్టీలో చేరనున్ననట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రాహుల్ మానససరోవర యాత్రలో ఉన్నారు. 11వ తేదీ రాత్రి రాహుల్ ఢిల్లీకి చేరుకోనున్నారు. డీఎస్ రాకపై కాంగ్రెస్ నేతలు కూడా సానుకూలంగానే ఉన్నారు. అందుకే కేసీఆర్ టార్గెట్ గా డీఎస్ మరింత దూకుడు పెంచారు. కాంగ్రెస్‌లో చేరికకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న ఆయన తనను సస్పెండ్ చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సస్పెండ్ చేయకుంటే కనుక అధిష్ఠానంపై మాటల యుద్దానికి దిగడం ద్వారా తన పంతాన్ని నెగ్గించుకోనున్నారు. డిఎస్ చేరితే పిసిసి పీఠం ఆయనకే దక్కవచ్చన్న ప్రచారం కూడా ఉంది. ఆయనకు పగ్గాలు అప్పగించి ఎన్నికల్లో పోటీకి దిగవచ్చిన తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీఎస్ 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. అయితే, డీఎస్ ఇద్దరు కుమారుల్లో ఒకరు బీజేపీలో చేరడం, మరో కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుండడంతో నెమ్మదిగా విభేదాలు మొదలయ్యాయి. దీనికితోడు డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఎంపి కవిత ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు తీర్మానం చేసి సీఎం కేసీఆర్‌కు పంపడంతో అవి మరింత ముదిరాయి.
స్థానిక ప్రజాప్రతినిధులు పంపిన తీర్మానంపై సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, తనను పిలిచి వివరణ అడగకపోవడంతో డీఎస్ కినుక వహించారు. పార్టీలో తనకు విలువ లేకుండా పోయిందని గుర్తించారు. ఈ క్రమంలో పార్టీతో అవిూతువిూకి సిద్ధమయ్యారు. అధిష్ఠానానికి రెండు పేజీల లేఖ రాశారు. తనంతట తానుగా రాజీనామా చేయబోనని, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. ఇదే విషయాన్ని విూడియా సమావేశంలోనూ వెల్లడించారు. మరో వారం రోజులు వేచి చూసి అప్పటికీ తనను సస్పెండ్ చేయకపోతే పార్టీ మారాలని డీఎస్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన అనుచరులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
—————–


