– ప్రజలంతా మరోసారి తెరాసకే పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారు
– ఎన్ని కూటములొచ్చినా తెరాసను నిలువరించలేరు
– ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి
– పరిగిలో ప్రచారంలో పాల్గొన్న మహేందర్‌రెడ్డి
వికారాబాద్, అక్టోబర్ 10(జనంసాక్షి) : మహాకూటమిది అనైతిక బంధమని ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో మహేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం విూడియా సమావేశంలో మాట్లాడారు.. అకాశవాదులను, అబద్దాల కోరులను ప్రజలు నమ్మరని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కోర్టులకెళ్లారని విమర్శించారు. మహా కూటమి అనైతిక బంధమన్నారు. నాడు కాంగ్రెస్ ను తరిమేసేందుకే ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేస్తే నేడు చంద్రబాబు నాయుడు మళ్లీఅదే పార్టీతో పొత్తు పెంటుకుంటారా అని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు మళ్లీ ఆంధ్రా పాలకుల్లో తెలంగాణాను పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఎప్పుడు అకవాశం వస్తుందా అని కాచుకొని కూర్చున్న చంద్రబాబుకు పిలిచిమరీ పెద్దపీట వేస్తున్నారని, మళ్లీ ఆంధ్రాపాలకుల పెత్తనం ఇచ్చేందుకు తమ స్వార్థంకోసం కాంగ్రెస్
ఉవ్విళ్లూరుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నాలుగేళ్ల కాలంలో తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిపథంలో నడిపించిందన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్ కొరత తీవ్రమవుతుందని అన్న నేతల మాటలను సవాల్‌గా తీసుకుని కేసీఆర్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులను అన్ని విధాల ఆదుకొనేందుకు కేసీఆర్ ప్రత్యేక పథకాలను అమలు చేశారన్నారు. ఆంధ్రాపాలకుల హయాంలో వ్యవసాయం అంటే దండగ అనే విధంగా మార్చారని, కానీ కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో వ్యవసాయం అంటే పండుగ అనే విధంగా మార్చారని అన్నారు. నాలుగేళ్ల కేసీఆర్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. అభివృద్ధి సాగాలంటే ప్రజలంతా కేసీఆర్‌నే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నారని, ఎన్ని కూటమిలు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వ ఏర్పాటును ఆపటం ఎవరితరం కాదని అన్నారు. వికారాబాద్ లో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుస్తారని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు కొప్పుల హరీష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు.
మహాకూటమిది అనైతిక బంధం




