సురక్షిత నగరాల్లో హైదరాబాద్ ఒకటి
డయల్ 100కు రోజుకు 5 వేల కాల్స్
సీపీ అంజనీకుమార్
రవీంద్ర భారతిలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
హైదరాబాద్, జూన్21(జనం సాక్షి) : రాష్ట్రంలో మహిళల భద్రతకు పోలీస్‌శాఖ ప్రాదాన్యమిస్తుందని, సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌ఒకటిగా నిలిస్తుందని నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. రవీంద్ర భారతిలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల పట్ల గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోకిరీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాటికలను ప్రదర్శించారు. ఈ సదస్సుకు నగర పోలీసు కమిషనర్ సీపీ అంజనీకుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, క్రీడాకారిణి నైనా జైస్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. మహిళల భద్రత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను మరింత సురక్షితంగా మార్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎవరైనా నేరం చేయడం తప్పు అని చెప్పారు. నేరాన్ని చూస్తూ ఊరుకోవడం కూడా పెద్ద తప్పని పేర్కొన్నారు. డయల్ 100 నంబర్ విూకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 100కు రోజుకు 5వేల కాల్స్ వస్తున్నాయని సీపీ తెలిపారు. కాల్ చేసిన 5 నిమిషాల్లో పోలీసు వాహనం ఘటనాస్థలికి చేరుకుంటుందని స్పష్టం చేశారు. నగరంలోని 65 పోలీసు స్టేషన్లలో రోజుకు 15 వరకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. స్టేషన్ల వారీగా పనితీరును సవిూక్షిస్తున్నామని వెల్లడించారు. స్నేహపూరిత పోలీసింగ్ దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ప్రతి పౌరుడిలో పోలీసు ఉంటాడని, సమాజాభివృద్ధి, నేర నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆపదలో ఉన్న మహిళలు హాక్ ఐ అప్లికేషన్ ద్వారా తక్షణ సాయం పొందవచ్చని సీపీ సూచించారు. నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. శాంతి భద్రతల రక్షణలో సీసీ కెమెరాలు కీలక భూమిక పోషిస్తున్నాయని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను సులభంగా గుర్తిస్తున్నామని సీపీ తెలిపారు. పోలీసు శాఖలో చేరేందుకు వస్తున్న మహిళల సంఖ్య పెరగడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. మహిళల పట్ల వేధింపులను అరికట్టడంలో షీ టీమ్స్ పనితీరు అభినందనీయమని సీపీ పేర్కొన్నారు.
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం




