Wednesday, 4 November 2026

మహిళా పారిశ్రామికవేత్తలకు.. 

ప్రభుత్వం అండగా ఉంటుంది
– కాలుష్య రహిత కంపెనీలు నెలకొల్పాలి
– రాష్ట్ర మంత్రి కేటీఆర్‌
– మహిళా పారిశ్రామిక వేత్తలకు భూ పత్రాలు అందించిన కేటీఆర్‌
హైదరాబాద్‌, జులై6(జ‌నం సాక్షి  ) : మహిళా పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ ప్రబుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎఫ్‌ఎల్‌వో టీఎస్‌ఐఐసీ ఇండస్టియ్రల్‌ పార్క్‌ను కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిక్కీ మహిళా విభాగం ఇండస్టియ్రల్‌ పార్క్‌లో 18 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారు. ఇందుకు సంబంధించిన భూ కేటాయింపు పత్రాలను మహిళా పారిశ్రామికవేత్తలకు కేటీఆర్‌ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. సుల్తాన్‌పూర్‌ వద్ద 50 ఎకరాల్లో ఇండస్టియ్రల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మరిన్ని స్థలాలు కేటాయించేందుకు సిద్ధంగా
ఉన్నామని మంత్రి తెలిపారు. కాలుష్య రహిత కంపెనీలు నెలకొల్పిన మహిళా పారిశ్రామికవేత్తలకు మంత్రి సూచించారు.  మహిళా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, వీటి ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే పలు పరిశ్రమల స్థాపనతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లభించాయని కేటీఆర్‌ తెలిపారు. అనంతరం మహిళా పారిశ్రామిక వేత్తలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వ్యర్థ పదార్థాలతో కాలుష్య రహితంగా నూతన ఉత్పత్తులు తయారు చేయడాన్ని మంత్రి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.