చిత్తూరు,ఫిబ్రవరి26(జనంసాక్షి): మహిళా సాధికారతపై స్మారక తపాలా బిళ్లలను రూపకల్పన చేసే సౌలభ్యం దేశ పౌరులకే కల్పించించాలని తపాలాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఎవరికి వారు తయారుచేసి పంపే విధంగా అవకాశాలను ఇచ్చింది. జాతీయస్థాయిలో ‘స్వాతంత్య దినోత్సవం-2015 తపాలా బిళ్లల రూపకల్పన పోటీలు’ తపాలాశాఖ నిర్వహిస్తోంది. మహిళా సాధికారత అనే అంశంపై తపాలా బిళ్లను రూపొందించి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 లోపు డి.డి.జి., ఫిలాటెలీ, డాక్ భవన్, న్యూఢిల్లీ అనే చిరునామాకు పంపాలని తిరుపతి తపాలా సూపరింటెండెంట్ తెలిపారు. తపాలా బిళ్లను ఏ4 పరిమాణపు కాగితంపై తయారు చేయాలన్నారు. పంపే కవరుపై స్వాతంత్య దినోత్సవం-2015 తపాలా బిళ్లల రూపకల్పన పోటీలు అని రాసి పంపాలని ఆయన వివరించారు. పూర్తి వివరాలకు ఇండియాపోస్ట్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఎంపికైన వాటిని ముద్రించి ఆగస్టు-సెప్టెంబరు మధ్య కాలంలో స్మారక తపాలా బిళ్లలుగా విడుదల చేయనున్నట్లు వివరించారు. క్రికెట్ ప్రేమికుల కోసం కూడా తపాలాశాఖ అరుదైన అవకాశం కల్పించింది. ప్రపంచ క్రికెట్ కప్-2015 సావనీర్ తపాలాబిళ్లలను తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి తెచ్చారు. న్యూజిలాండ్ పోస్ట్ ముద్రించిన ఈ సావనీర్‌లో ప్రపంచకప్‌లో పాల్గొంటున్న 14 దేశాల జాతీయ జెండా చిహ్నాలు, ఆయా దేశాలకు కేటాయించిన
రంగులతో ఆకర్షణీయంగా ముద్రించి క్రికెట్ అభిమానులకు మధుర జ్ఞాపకంగా ఇస్తున్నారు. ఒక్కోదాన్ని రూ.400కు విక్రయిస్తున్నట్లు తిరుపతి తపాలా సూపరింటెండెంట్ తెలిపారు. తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఈ సావనీర్ తపాలా బిళ్లలు అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.




