మాజీ డీఎస్పీ నళినికి అదే ఉద్యోగం మనమెందుకివ్వద్దు
` సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఎమిటని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అడిగారు. నళినికి ఉద్యొగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీ.ఎస్, డీజీపీ లను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా వుంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. సచివాలయంలో శుక్రవారం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాలవిూద సవిూక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యొగాల్లో చేరిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకుండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.