– పీవీ సేవలను స్మరించుకున్న ప్రముఖులు
– దేశాన్ని విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేలా చేశారన్న ప్రధాని మోదీ
– పీవీ సమాది వద్ద నివాళులర్పించిన మంత్రి నాయిని
హైదరాబాద్, జూన్28(జనం సాక్షి) : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని పలువురు ఘన నివాళులర్పించారు. జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ¬ం మంత్రి నాయిని నరసింహారెడ్డి హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఆయన సమాధికి నాయిని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ బహుభాషా కోవిదుడు, నూతన ఆర్ధిక సంస్కరణలను దేశానికి పరిచయం చేసిన ఆర్ధిక వేత్త అని కొనియాడారు. మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపిన ఘనత పీవీదేనని ఆయన కొనియాడారు. పీవీ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు పాల్గొన్నారు.
తెదేపా ఎంపీల నివాళి..
పీవీ నరసింహరావుకు తెలుగుదేశం ఎంపీలు ఘన నివాళి అర్పించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పీవీ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భగా జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశానికి ప్రధానులు చేసిన వారందరిలో పీవీ నరసింహరావుది ప్రత్యేక శైలి అని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించారన్నారు. ఎంతో చాకచక్యంగా పరిపాలన సాగించడం ద్వారా క్లిష్టపరిస్థితుల్లో దేశాన్ని పురోభివృద్ధిలోకి తీసుకెళ్లిన ఘనత పీవీకి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మురళీ మోహన్, రాంమ్మోహన్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతల నివాళి..
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 97వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. గురువారం ఉదయం మాజీ గవర్నర్ రోశయ్య, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి నెక్లెస్‌రోడ్డులోని పీవీ ఘాట్‌కు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ దేశ ప్రధానిగా పీవీ తీసుకొచ్చిన సంస్కరణలు చాలా గొప్పవన్నారు. ఆయన హయాంలో దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. పీపీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి పదంలో నిలిపిందని రోశయ్య అన్నారు. పొన్నాల లక్ష్మయ్య, పలువురు కాంగ్రెస్ నేతలు పీవీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
దేశాన్ని విపత్కర పరిస్థితుల నుండి బయటపడేసిన పీవీ – ప్రధాని
మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు. ‘మన మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నామని, ఆయన ఒక రాజనీతిఙ్ఞుడు. విలువైన నాయకత్వంతో దేశాన్ని విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేలా చేశారని పీవీ కొనిడాయారు. లోతైన పరిఙ్ఞానం, విఙ్ఞత కలిగిన గొప్ప మేధావి ఆయన’ అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే భారత తొమ్మిదవ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నామని, చాణక్యుడిగా పేరొందిన పీవీ తన మేధస్సుతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఎంతో సమర్థవంతంగా నడిపించారంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. గతేడాది కాంగ్రెస్ పార్టీ పీవీ జయంతిని గుర్తుపెట్టుకోలేదు గానీ ఇప్పుడు ప్రధాని మోదీ ట్వీట్ చూసిన అనంతరం.. ఈవిధంగా తమ సొంత పార్టీకి చెందిన గొప్ప మేధావి, ప్రభావశీలిని స్మరించుకోవాలనే స్పృహ రావడం చూస్తుంటే అచ్చేదిన్ వచ్చినట్లుగానే కన్పిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మాజీ ప్రధాని పీవీకి ఘన నివాళి




